ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రమాద బీమా ధీమా
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:19 AM
దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ సర్కారు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రమాద బీమా పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది.
ప్రమాదంలో మరణిస్తే కోటీ ఇరవై లక్షల రూపాయలు
60 ఏళ్లలోపు సహజ మరణమైతే.. రూ.10 లక్షలు
ప్రీమియం కింద రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు
మొత్తం 7.57 లక్షల మందికి దీంతో ప్రయోజనం
ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్‌కో ఉద్యోగులకు అమలు
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ సర్కారు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రమాద బీమా పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఉద్యోగి/పెన్షనర్ ప్రమాదంలో మరణిస్తే.. ఈ పథకం కింద వారి కుటుంబాలకు రూ.1.2 కోట్లు పరిహారంగా అందుతుంది. సహజ మరణమైతే..60 ఏళ్ల వరకూ ఉద్యోగులకు రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఇందుకుగాను ఉద్యోగులు ఒక్క రూపాయి ప్రీమియం కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సర్కారు తొలుత సింగరేణి, ట్రాన్స్‌కో ఉద్యోగులకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అక్కడ విజయవంతంగా అమలుకావడంతో.. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికి అమలు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో 5.19 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులున్నారు. అలాగే, 2.38 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తం ఈ 7.57 లక్షల మందికీ ఈ ప్రమాద బీమా వర్తించనుంది. అటు ఉద్యోగులు, ఇటు ప్రభుత్వంపై ఎలాంటి భారం లేకుండా బ్యాంకర్ల ద్వారా ఈ బీమా అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ పథకం అమలుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది.