రూ.98 వేల కోట్లతో రహదారుల నిర్మాణం
ABN , Publish Date - Apr 23 , 2026 | 05:03 AM
రాష్ట్రంలో రూ.98 వేల కోట్లతో రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతున్నామని, వీటిని వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
అధికారులు పనులు వేగవంతం చేయాలి..
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు
అప్రోచ్ రోడ్లతో 300 గ్రామాల సమస్యలకు పరిష్కారం..
రోడ్ల నిర్మాణంతో రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు: కోమటిరెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రూ.98 వేల కోట్లతో రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతున్నామని, వీటిని వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 2028 చివరి నాటికి రోడ్ల నిర్మాణంలో దేశంలోనే తెలంగాణను ప్రథమ స్థానంలో నిలిపేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. దేశంతో పాటు, ప్రపంచం నలుమూలల నుంచి రోడ్డు కాంట్రాక్టర్లు, బిల్డర్లు హాజరయ్యే ప్రతిష్ఠాత్మక ఇండియన్ రోడ్ కాంగ్రెస్‌ను వచ్చే నవంబరులో నిర్వహించనున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఈ సదస్సు నిర్వహణకు బీజేపీ పాలిత రాష్ట్రాలు పోటీ పడినప్పటికీ.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తనకున్న సాన్నిహిత్యం వల్ల రాష్ట్రంలో నిర్వహించేందుకు ఒప్పించానన్నారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిర్వహణ అనంతరం రాష్ట్రానికి రూ.20 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని చెప్పారు. రూ.148 కోట్లతో నిర్మించనున్న అప్రోచ్ రహదారులతో 300 గ్రామాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభించనుందని ఆయన తెలిపారు. రూ.20 వేల కోట్లతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి అభివృద్ధి పనులను చేపడుతున్నామని.. మొత్తం 8 లేన్లతో ఈ రహదారిని విస్తరిస్తున్నామని వెల్లడించారు. మన్ననూరు-శ్రీశైలం మధ్య 52 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.8 వేల కోట్లను కేటాయించామన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణానికి రూ.36 వేల కోట్లు మంజూరయ్యాయని, ఇది రాష్ట్రానికి గేమ్ చేంజర్ ప్రాజెక్టు అని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం భూసేకరణ కోసం ఈ నెల 8న రాష్ట్ర వాటాగా రూ.628 కోట్లను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు జమ చేశామన్నారు. ఎల్బీనగర్-హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌ను రూ.941 కోట్లతో చేపడుతున్నామని వివరించారు. ఇందులో కేంద్రం వాటా రూ.741 కోట్లు కాగా.. రాష్ట్రం నుంచి రూ.200 కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. రహదారులు లేని గ్రామాల్లో కొత్త రోడ్లు, సింగిల్ రోడ్ల స్థానంలో డబుల్ రోడ్లను నిర్మించామని మంత్రి తెలిపారు. రోడ్ల నిర్మాణంతో రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు వస్తాయన్నారు.
పాలనలో మానవీయ కోణాన్ని మరవొద్దు: భట్టి
పరిపాలనలో మానవీయ కోణాన్ని మరిచిపోవద్దని, ప్రజాసేవలో నైతిక విలువలను పాటించాలని డిప్యూటీ సీఎం భట్టి కొత్తగా విధుల్లో చేరనున్న గ్రూప్-1 అధికారులకు సూచించారు. ప్రజల భవిష్యత్తుకు భరోసానివ్వడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. గ్రూప్-1కు ఎంపికైన 214 మంది (రెండో బ్యాచ్) అధికారులకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. దీనికి హాజరైన భట్టి మాట్లాడుతూ.. అధికారులు సంతకం చేసే ప్రతి ఫైలు వెనుక సామాన్యుడి ఆశ ఉంటుందని, అలాంటి ఫైళ్లను కేవలం కాగితాలుగా కాకుండా జీవితాలను మార్చే శక్తిగా చూడాలన్నారు.