2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు విడుదల
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:36 AM
వైద్యారోగ్యశాఖలో మరో భారీ నియామక ప్రక్రియ పూర్తి అయింది. 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్...
రేవంత్ పాలనలో 12,649 ఆరోగ్య శాఖ పోస్టుల భర్తీ
మరో 4,500 పోస్టుల భర్తీకి కసరత్తు
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): వైద్యారోగ్యశాఖలో మరో భారీ నియామక ప్రక్రియ పూర్తి అయింది. 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను బోర్డు తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పారదర్శకత కోసం పరీక్ష రాసిన సుమారు 42 వేల మంది అభ్యర్థుల వివరాలను కూడా బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో దామోదర్ రాజనర్సింహా ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు 12,649 పోస్టుల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఇంకా మరో 4,500 పోస్టుల భర్తీకి కసరత్తు కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నడూ లేనివిధంగా ఈ రెండేళ్లలోనే ఇన్ని వేల పోస్టులను భర్తీ చేయడం గమనార్హం. కేవలం నియామకాలు మాత్రమే కాకుండా, ప్రభుత్వ ఆసుపత్రులను అన్నివిధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అధికారులు అన్నారు. కోర్టు కేసులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నియామకాల ప్రక్రియ వేగంగా సాగేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. గతంలో ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వడానికి అడ్డంకులు చెప్పిన జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ), కొత్తగా 10 మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లను మంజూరు చేసిందని, ఈ ఏడాది మరో 250కి పైగా పీజీ సీట్ల కోసం వైద్యవిద్యాశాఖ ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేసిందని చెప్పారు. ఇవేగాకుండా, జిల్లా సెకండరీ కేర్ హాస్పిటళ్లలో కొత్తగా 5 పీజీ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తద్వారా జిల్లాస్థాయిలోనే ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య ేసవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.