Share News

త్వరలో 15 వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీ!

ABN , Publish Date - Mar 29 , 2026 | 06:40 AM

రాష్ట్రంలో 15 వేల అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ వెలువరించనున్నట్లు పంచాయతీరాజ్‌, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క ప్రకటించారు.

త్వరలో 15 వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీ!

  • ఆయాలు, టీచర్ల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేస్తాం: సీతక్క

  • బీఆర్‌ఎస్‌ వాకౌట్‌.. మంత్రి ఆగ్రహం

హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 15 వేల అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ వెలువరించనున్నట్లు పంచాయతీరాజ్‌, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క ప్రకటించారు. ఆయాలు, టీచర్ల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచామన్నారు. పొదుపు సంఘాలకు రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని తెలియజేశారు. శాసనసభలో సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆమె బదులిచ్చారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై సర్వే చేయగా.. 4 లక్షల ఇళ్లకు నీటి కనెక్షన్లు లేవని, మరో 3 లక్షల ఇళ్లకు నీళ్లు రావడం లేదని, వెరసి 7 లక్షల కుటుంబాలకు నల్లానీళ్లు అందడం లేదని గుర్తించామని, దీనికి నిధుల కోసం కేంద్ర జల్‌జీవన్‌ మిషన్‌కు రూ.1600 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని సీతక్క తెలియజేశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా వంద శాతం ప్రాంతాలకు నీళ్లు ఇచ్చామని ప్రకటించారని, దీంతో ఈ నిధులను కేంద్రం నిలిపివేసిందన్నారు. పదేళ్లలో పంచాయతీలకు ఇవ్వాల్సిన 42 శాతం మ్యాచింగ్‌ గ్రాంట్లను గత ప్రభుత్వ హయాంలో మళ్లించారని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా లక్ష మందికి పెన్షన్లు ఇచ్చామని, రానున్న రోజుల్లో మరో 2 లక్షల మందికి ఇస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి, దాని స్థానంలో తెచ్చిన పథకంతో రాష్ట్రంపై రూ.1500 కోట్ల భారం పడిందన్నారు. మహిళల పట్ల గౌరవాన్ని పెంచేలా పాఠశాల విద్యార్థుల సిలబ్‌సలో మార్పులు చేస్తామన్నారు.


పంచాయతీలకు ప్రత్యేక నిధులివ్వాలి: బీఆర్‌ఎస్‌

99 రోజుల ప్రజా పాలన ఉత్సవాల కార్యక్రమంలో పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని నర్సాపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో 20 రోజుల పనిదినాల నిబంధనను సడలించి, సహాయం చేయాలని కోరారు. యువతీ యువకులు పెళ్లి కోసం దరఖాస్తు పెట్టుకుంటే పిల్లలు పుట్టిన తర్వాత ప్రభుత్వం నుంచి సహాయం అందుతోందని సునీత విమర్శించారు. పంచాయతీలకు మూడునెలలకు ఒకసారి నిధులు ఇస్తేనే మేలు జరుగుతుందని, ఆర్నెల్లకు ఒకసారి ఇచ్చే నిధులతో ఏ పనిచేయలేరని సిర్పూర్‌-కాగజ్‌నగర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీ్‌షబాబు అన్నారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ వాకౌట్‌ చేయగా... మంత్రి సీతక్క వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలు చెప్పడం వారి నైజమన్నారు.

Updated Date - Mar 29 , 2026 | 06:41 AM