తెలుగు పోలీసులకు పతకాల పంట
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:47 AM
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో విధి నిర్వహణలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి, విశేష సేవలందించిన పోలీస్ అధికారులకు భారీగా శౌర్య, సేవా పతకాలు లభించాయి.
భారీగా శౌర్య, ప్రతిభా, రాష్ట్రపతి సేవా పతకాలు.. తెలంగాణ నుంచి 23 మంది ఎంపిక
న్యూఢిల్లీ/హైదరాబాద్/శంకర్‌పల్లి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో విధి నిర్వహణలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి, విశేష సేవలందించిన పోలీస్ అధికారులకు భారీగా శౌర్య, సేవా పతకాలు లభించాయి. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ ఆదివారం ప్రకటించిన ఈ పతకాల్లో తెలంగాణకు 23, ఆంధ్రప్రదేశ్‌కు 19 దక్కాయి. దేశవ్యాప్తంగా పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీ్‌సలకు చెందిన 982 మందికి పతకాలు ప్రకటించారు. 125 మందికి శౌర్య పతకాలు (గ్యాలెంట్రీ మెడల్స్), 101 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 756 మందికి ప్రతిభా సేవా పతకాలు (మెడల్స్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) లభించాయి. తెలంగాణ పోలీసు శాఖకు చెందిన హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట్‌రెడ్డికి శౌర్య పతకం (గ్యాలెంట్రీ మెడల్) లభించింది. జీఎస్ ప్రకాశ్‌రావు (అదనపు ఎస్పీ), అన్ను దామోదర్‌రెడ్డి (ఎస్‌ఐ)కి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు లభించాయి. పోలీస్ సర్వీస్ విభాగం కింద 12 మంది పోలీసులకు ప్రతిభా సేవా పతకాలు లభించాయి. వీరిలో బడుగుల సుమతి (ఐజీ), పాగుంట వెంకట్రాములు (కమాండెంట్), మొగిలిచర్ల శంకర్ (డీఎస్పీ), భానుమూర్తి (సీనియర్ కమాండెంట్), కేవీఎం ప్రసాద్ (డీసీపీ), సి.వంశీమోహన్‌రెడ్డి (డీఎస్పీ), టి.లక్ష్మి (డీఎస్పీ), బూర ఎల్లయ్య (ఎస్‌ఐ), వి. పురుషోత్తంరెడ్డి (ఎస్‌ఐ), సయ్యద్ అబ్దుల్ కరీం (ఎస్‌ఐ), బి. ఆనందం (ఏఎ్‌సఐ), పైలి మనోహర్ (హెడ్ కానిస్టేబుల్) ఉన్నారు. ఫైర్ సర్వీస్ విభాగం కింద లీడింగ్ ఫైర్ ఫైటర్లు జి.రాజేందర్, హనుమంతరావు గౌతి, రవీందర్ కోలాపురి.. హోంగార్డ్ అండ్ సివిల్ ఢిఫెన్స్ విభాగం కింద హోంగార్డులు రవి మాసరాం, పి. జంగయ్య, రేణుక బుర్రనోళ్ల (మహిళ హోంగార్డు)కు.. కరెక్షనల్ సర్వీస్ కింద ఎం.సుధాకర్‌రెడ్డి (డిప్యూటీ జైలర్), కె. అశోక్‌కుమార్ (అసిస్టెంట్ డిప్యూటీ జైలర్)లకు పతకాలు దక్కాయి. తెలుగువాళ్లయిన సీఆర్‌పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ కె.విశ్వనాథ్‌గౌడ్‌కు శౌర్య పతకం, సీబీఐ హెడ్ కానిస్టేబుల్ రాముకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం, సీబీఐ జేడీ వెంకట సుబ్బారెడ్డి, బీఎ్‌సఎఫ్ హెడ్ కానిస్టేబుల్ జయకుమార్ , సీఐఎ్‌సఎఫ్ ఏఎ్‌సఐ వై.నాగేశ్వర్‌రావు, కేంద్ర హోంశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శైలేంద్రరావుకు సేవా పతకాలు లభించాయి.
దక్షిణ మధ్య రైల్వే ఐజీ అరోమాసింగ్‌కు..
దక్షిణ మధ్య రైల్వే ఇన్‌స్పెక్టర్ జనరల్ అరోమాసింగ్ ఠాకూర్, సివిల్ డిఫెన్స్ కంట్రోలర్ కేఎల్‌ఎన్ స్వామి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. ఇదే విభాగానికి చెందిన అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఉత్తమ్‌కుమార్, ఎస్‌ఐ శ్రీనివాస్ రావుల, హెడ్ కానిస్టేబుల్ మహేశ్వర్‌రెడ్డి కర్నాటి, తూర్పు తీర రైల్వేకు చెందిన ఎస్‌ఐ పప్పల శ్రీనివా్‌సరావు, ఏఎ్‌సఐ దిక్కల వెంకట మురళీకృష్ణ ప్రతిభా సేవా పతకాలకు ఎంపికయ్యారు.
బుల్లెట్ తగిలినా వెనక్కి తగ్గకుండా..
గ్యాలెంట్రీ మెడల్‌కు ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా సింగాపురం. ఆయన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శేరిలింగంపల్లి జోన్ సీసీఎ్‌సలో విధులు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో గత ఏడాది ఫిబ్రవరి 1న రాత్రి ఏపీకి చెందిన పాత నేరస్తుడు బత్తుల ప్రభాకర్‌ను పట్టుకునేందుకు సహచరులైన ప్రదీ్‌పరెడ్డి, వీరాస్వామిలతో కలిసి వెళ్లారు. వీరిపై ప్రభాకర్ తుపాకీతో కాల్పులు జరపటంతో వెంకట్‌రెడ్డి ఎడమకాలికి బుల్లెట్ తగిలింది. అయినా లెక్క చేయకుండా ప్రభాకర్‌ను పట్టుకున్నాడు. గత ఏడాది మే 5న జీ అవార్డు-2025 రియల్ హీరోస్ పురస్కారాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా వెంకట్‌రెడ్డి అందుకున్నారు. తాజాగా గ్యాలెంట్రీ అవార్డుకు ఎంపిక కావడం గర్వంగా ఉందని వెంకట్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
త్రివిధ దళాల్లోని తెలుగువారికి పతకాలు
త్రివిధ దళాల్లో పనిచేస్తున్న పలువురు తెలుగువారికి కూడా సేవా పతకాలు లభించాయి. ఎయిర్ మార్షల్ సీతేపల్లి శ్రీనివా్‌సకు పరమ్ విశిష్ట సేవా పతకం, వైస్ అడ్మిరల్ కుదరవల్లి శ్రీనివాస్, ఎయిర్ వైస్ మార్షల్ శెట్టిపల్లి శ్రీనివాసరావు, ఎయిర్ వైస్ మార్షల్ వాడపల్లి రవి సత్యనారాయణ రాజుకు అతి విశిష్ట సేవా పతకాలు, సైనిక మేజర్ గుమ్మడి శ్రీనివాస్, నేవీ రియర్ అడ్మిరల్ శ్రీనివాస్ మద్దుల, సరిహద్దు రహదారుల అభివృద్ధి బోర్డు సివిల్ ఇంజినీర్ ఆర్.శ్రీనివాసరావు విశిష్ట సేవా మెడల్‌కు ఎంపికయ్యారు.