Share News

గత ఆర్థిక సంవత్సరంలో లక్షా 25 వేల కోట్లు

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:24 AM

గడిచిన ఆర్థిక సంవత్సరంలో లక్షా 25 వేల కోట్ల ఆదాయపు పన్ను చెల్లింపులతో తెలుగు రాష్ట్రాలు దేశంలో నాలుగో స్థానానికి చేరుకున్నాయని తెలంగాణ, ఏపీ ఆదాయపు పన్ను కమిషనర్లు బి.బాలకృష్ణ...

గత ఆర్థిక సంవత్సరంలో లక్షా 25 వేల కోట్లు

  • తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్నుల చెల్లింపులు

  • దేశంలో నాలుగో స్థానం

  • ఆదాయపు పన్ను శాఖ కమిషనర్లు బాలకృష్ణ, హరిత

సికింద్రాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి) : గడిచిన ఆర్థిక సంవత్సరంలో లక్షా 25 వేల కోట్ల ఆదాయపు పన్ను చెల్లింపులతో తెలుగు రాష్ట్రాలు దేశంలో నాలుగో స్థానానికి చేరుకున్నాయని తెలంగాణ, ఏపీ ఆదాయపు పన్ను కమిషనర్లు బి.బాలకృష్ణ, కె.హరిత తెలిపారు. తెలంగాణ, ఏపీ ట్యాక్స్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం సికింద్రాబాద్‌లో ‘ఆదాయం పన్ను సమస్యల’పై ఆ శాఖ కమిషనర్లతో బహిరంగ చర్చా వేదిక నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 200 మంది చార్టర్డ్‌ అకౌంటెంట్లు, పన్ను న్యాయవాదులు హాజరై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ వేముల కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అసోసియేషన్‌ తెలుగు రాష్ట్రాల నూతన సభ్యుల డైరెక్టరీని బి.బాలకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆదాయపు పన్ను చట్టం-2025 దేశ ప్రత్యక్ష పన్నుల వ్యవస్థను ఆధునీకరించి, సరళీకృతం చేసిందని చెప్పారు. దీని ద్వారా ప్రజలకు గణనీయంగా ప్రయోజనం కలుగుతుందన్నారు. దీంతో తెలుగురాష్ట్రాల్లో ఆదాయం పన్ను చెల్లింపులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. కొంతమంది తప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడం ద్వారా తీవ్రమైన పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారని, అలాంటి వారికి భారీ జరిమానా, జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రజలు సీఏలు, న్యాయవాదుల సలహాలు, సూచనలు తీసుకుని సకాలంలో ఆదాయపు పన్నులు చెల్లించి, దేశ ప్రగతికి తోడ్పడాలని కోరారు. కె.హరిత మాట్లాడుతూ... టీడీఎస్‌ విధానంలో పన్నులను ముందుగానే వసూలు చేయడం ద్వారా పన్ను ఎగవేతను నివారిస్తుందని, ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయం, ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. టీడీఎస్‌ మీ అసలు పన్ను బాధ్యతను మించి ఉంటే ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసినప్పుడు వాపసు పొందడానికి అర్హులని చెప్పారు. ప్రస్తుతం ఒక్క రోజులోనే రీఫండ్‌ అందిస్తున్నామన్నారు. అసోసియేషన్‌ కార్యదర్శి ఆశిష్‌ జోషి, కోశాధికారి సోమేశ్వర్‌ నెమ్మాని పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2026 | 04:24 AM