తమిళనాడుతో తెలంగాణకున్నది పోటీ కాదు
ABN , Publish Date - Oct 16 , 2026 | 06:21 AM
తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు పారిశ్రామిక రంగంలో పరస్పరం పోటీపడే రాష్ట్రాలు కావని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి పని చేస్తే దక్షిణ భారతదేశం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.
2 రాష్ట్రాలూ కలిసి పని చేస్తే దక్షిణ భారతం మరింత బలోపేతం
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-26 రోడ్‌షోలో శ్రీధర్‌బాబు
హైదరాబాద్, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు పారిశ్రామిక రంగంలో పరస్పరం పోటీపడే రాష్ట్రాలు కావని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి పని చేస్తే దక్షిణ భారతదేశం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని తమిళనాడు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సహకారంతో చెన్నైలో గురువారం నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ రోడ్‌షోలో శ్రీధర్ బాబు ఉపన్యసించారు. పారిశ్రామిక రంగంలో తమిళనాడు సాధించిన ప్రగతిని ప్రస్తావించిన శ్రీధర్‌బాబు.. ఆ రాష్ట్రం నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. ఇంజనీరింగ్ విద్య, ఆటోమొబైల్ తయారీ, ఎలకా్ట్రనిక్స్ ఉత్పత్తి, విద్యుత్ వాహనాల తయారీలో తమిళనాడు దేశానికి ఆదర్శమని కొనియాడారు. తమిళనాడుకు తనదైన బలాలు ఉన్నాయని, తెలంగాణకు ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని.. రెండు రాష్ట్రాలు కలిసి పని చేస్తే దక్షిణ భారతదేశం మరింత అభివృద్థి చెందుతుందని పేర్కొన్నారు. కోయంబత్తూరు, తిరుప్పూర్ పర్యటనల సందర్భంగా అక్కడి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పనితీరును దగ్గరగా పరిశీలించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా డిసెంబరు 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్‌సిటీలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులకు నిర్ణీత సమయంలో అనుమతులు ఇచ్చేందుకు టీజీ-ఐపాస్ విధానం అందుబాటులో ఉందన్నారు. తమిళనాడు పారిశ్రామిక వేత్తలకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని వివరించారు. కోయంబత్తూరులోని పంపుల తయారీ సంస్థలు ఉత్తర, మధ్య భారత మార్కెట్లకు చేరువయ్యేందుకు తెలంగాణలో రెండో యూనిట్లను ఏర్పాటు చేయవచ్చన్నారు.
తిరుప్పూర్ నిట్వేర్ పరిశ్రమలు వరంగల్‌లోని పత్తి ఆధారిత వస్త్ర పరిశ్రమలతో కలిసి పనిచేయవచ్చని సూచించారు. చెన్నై ఆటోమొబైల్ విడి భాగాల తయారీ సంస్థలు హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ నిపుణుల సహకారంతో విద్యుత్ వాహనాల ఎలక్ర్టానిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టవచ్చని తెలిపారు. అనంతరం తైవాన్, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, రష్యా, థాయ్‌లాండ్, మలేషియా దేశాలకు చెందిన దౌత్య, వాణిజ్య ప్రతినిధులతోనూ శ్రీధర్‌బాబు చర్చలు జరిపారు.