Share News

జూరాలకు ప్రత్యామ్నాయంగా..

ABN , Publish Date - May 28 , 2026 | 04:03 AM

జూరాల ప్రాజెక్టు సామర్థ్యం ఏటికేడాదీ తగ్గిపోతోంది! ఏటా వేసవిలో నారాయణపూర్‌ నుంచి తాగు నీటి విడుదల కోసం కర్ణాటకకు విజ్ఞప్తి చేయాల్సి వస్తోంది.

జూరాలకు ప్రత్యామ్నాయంగా..

  • 3 రోడ్‌ కం బ్యారేజీల నిర్మాణంపై యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

  • కృష్ణాపై 1.08 టీఎంసీలతో ఒకటి, 0.4 టీఎంసీలతో బీమాపై రెండు

  • కుడిపక్కన కర్ణాటకకు, ఎడమ పక్కన తెలంగాణకు ఉపయోగాలు

  • కర్ణాటకలో 3 ప్రధాన రోడ్‌ కం బ్యారేజీల నిర్మాణంతో సత్ఫలితాలు

మహబూబ్‌నగర్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): జూరాల ప్రాజెక్టు సామర్థ్యం ఏటికేడాదీ తగ్గిపోతోంది! ఏటా వేసవిలో నారాయణపూర్‌ నుంచి తాగు నీటి విడుదల కోసం కర్ణాటకకు విజ్ఞప్తి చేయాల్సి వస్తోంది. ఉదాహరణకు.. 2024 వేసవిలో కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి 4 టీంఎసీలు ఎగువన నారాయణపూర్‌ నుంచి విడుదల చేయిస్తే అందులో సగం కంటే తక్కువ 1.90 టీఎంసీలు మాత్రమే జూరాలకు చేరాయి. గత ఏడాది వేసవిలో కర్ణాటకలో మన మంత్రులు పర్యటించి మరీ ఆ ప్రభుత్వంతో మాట్లాడి.. 5 టీఎంసీల నీటి విడుదలకు ఆమోదం తీసుకున్నారు. కానీ, రెండు టీఎంసీలు మాత్రమే విడుదలయ్యాయి. అందులోనూ 0.90 టీఎంసీల నీరే చేరింది. ఈ నేపథ్యంలో.. జూరాలకు ప్రత్యామ్నాయ మార్గాలపై సర్కారు యోచిస్తోంది. అందులో భాగంగా.. ఇటీవల చిన్ననీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు, రెండు రాష్ట్రాల రెవెన్యూ అధికారులు సమావేశమై కుడివైపు కర్ణాటకకు, ఎడమవైపు తెలంగాణకు ఉపయోగపడేలా మూడు రోడ్‌ కమ్‌ బ్యారేజీలు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. కృష్ణానదిపై కొల్పూరు- కొడితికొండ మధ్య 1.08 టీఎంసీల సామర్థ్యంతో ఒక బ్యారేజీ, బీమా నదిపై 0.4 టీఎంసీల చొప్పున సూగూరు- లింగంపల్లి, తంగిడి దగ్గర రెండు బ్యారేజీలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటి వల్ల కర్ణాటకలోని రాయచూర్‌జిల్లాకు, తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు తాగు, సాగునీటి అవసరాలు తీరనున్నాయి. దీంతోపాటు.. నీటి నిల్వ ఉండటం వల్ల జూరాలలో నీరు తగ్గినప్పుడు బ్యారేజీల నుంచి విడుదల చేసుకునే అవకాశం ఉంటుందని, కర్ణాటకపై ఆధారపడే అవస్థ ఉండదని వారు అభిప్రాయపడ్డారు. ఇందులో ఒక్క కొల్పూరు-కొడ్తికొండ బ్యారేజీకే రూ. 700 కోట్ల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు.


రోడ్‌ కం బ్యారేజీలతో సత్ఫలితాలు

రోడ్‌ కం బ్యారేజీలతో కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. పలు ప్రాంతాలకు దూరాభారం కూడా తగ్గుతుంది. ఇప్పటికే కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న రోడ్‌ కం బ్యారేజీలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రధానంగా ఆల్మట్టి దిగువన మూడు ప్రధాన బ్యారేజీలతో జూరాలకు రీ జనరేటెడ్‌ వాటర్‌ కూడా ఆఫ్‌ సీజన్‌లో ఆశించినంత రావడం లేదు. అదే సమయంలో కర్ణాటకలో తాగు, సాగునీటి అవసరాలు తీరుతున్నాయి. కర్ణాటక నిర్మించిన రోడ్‌ కం బ్యారేజీల్లో పెద్దది రాయచూర్‌ తాలుకాలోని గిరిజాపూర్‌ రోడ్‌ కం బ్యారేజీ. దీనికి 194 గేట్లను అమర్చారు. 1.5 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసుకోవచ్చు. దీనిద్వారా సాగునీటితో పాటు రాయచూర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే గుగల్‌ రోడ్‌ కం బ్యారేజీ దేవదుర్గ తాలుకాలో ఉండగా దాదాపు 0.5 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేస్తారని అంచనా. మూడోది హిప్పర్గి బ్యారేజీ. ఇది ఆల్మట్టి డ్యాం కింద బాగల్‌కోట్‌ జిల్లాలో ఉన్నది. దీనిలో 6 టీఎంసీల వరకు నీటిని స్టోర్‌ చేసుకుంటారు. ఇలా కర్ణాటకలో మరికొన్ని బ్యారేజీలు కూడా నిర్మిస్తున్నట్లు సమాచారం.

ప్రాథమిక చర్చలు పూర్తి

జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుండటం వల్ల వేసవిలో చాలా ఇబ్బంది అవుతోంది. ఏటా వేసవిలో తాగునీటి అవసరాల కోసం కర్ణాటకను వేడుకుంటున్నాం. అక్కడి నుంచి విడుదలైన నీటిలోనూ జూరాలకు సగమే చేరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 3 రోడ్‌ కమ్‌ బ్యారేజీలను నిర్మించాలని ప్రతిపాదిస్తున్నాం. వీటితో ఎడమవైపు తెలంగాణకు, కుడివైపు కర్ణాటకకు నీటి ఇబ్బందులు తీరతాయి. జూరాలకు కావాల్సినప్పుడు నీటిని విడుదల చేయవచ్చు. దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. త్వరలోనే తుదిరూపు ఇస్తాం.

- వాకిటి శ్రీహరి, రాష్ట్ర క్రీడా, పశుసంవర్థకశాఖ మంత్రి

Updated Date - May 28 , 2026 | 04:03 AM