Share News

50 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు!

ABN , Publish Date - Jul 13 , 2026 | 05:13 AM

ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా కొనసాగితే ఈ ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగు ఎలా ఉండాలి? తక్కువ నీటితో సాగయ్యే పంటలు ఏమిటి? ఏ జిల్లాలో ఏయే పంటలు సాగు చేయొచ్చు? వరి పంటను ఎంతకు పరిమితం చేయాలి?

50 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు!

  • మూడు దశల్లో సాగు ప్రణాళికల అమలుకు యోచన

  • ఈ నెల 15, 30, ఆగస్టు 15 నివేదికల ఆధారంగా నిర్ణయం

  • ఎల్‌నినో కొనసాగితే 30-40 లక్షల ఎకరాల్లోనే వరి సాగు

హైదరాబాద్‌, జులై 12(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా కొనసాగితే ఈ ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగు ఎలా ఉండాలి? తక్కువ నీటితో సాగయ్యే పంటలు ఏమిటి? ఏ జిల్లాలో ఏయే పంటలు సాగు చేయొచ్చు? వరి పంటను ఎంతకు పరిమితం చేయాలి? ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు ఎప్పటి నుంచి అమలు చేయాలి? అనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్రంలో ఇప్పటికీ వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోవటం, లోటు వర్షపాతం నమోదు కావటంతో రైతు లు ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యవసాయ, ఉద్యా న శాఖల అధికారులు, శాస్త్రవేత్తలతో మూడు రకాల ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించింది. వీటిని దశల వారీగా అమలు చేయాలని భావిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జూలై 15, 30, ఆగస్టు 15 తేదీల్లో నివేదికలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి ఆధారంగా ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది. పరిస్థితులకు అనుగుణంగా జిల్లాల వారీగా ఈ ప్రణాళికలు అమలు చేయనున్నారు.


ప్రతి జిల్లాలో వర్షపాతం, సాగు పురోగతి, నేల తేమ, విత్తనాల లభ్యత, రైతుల అవసరాలపై రోజువారీగా నివేదికలు విశ్లేషిస్తూ, అవసరమైనచోట తొలిగా ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికను ఈ నెల 15 నుంచి అమలులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో వర్షాలు వచ్చిన తర్వాతే రైతులు విత్తనాలు వేయాలని, కనీసం 50 మిల్లీ మీటర్ల వర్షపాతం రెండు, మూడు రోజులు నమోదై.. భూమిలో తగినంత తేమ ఏర్పడిన తర్వాతే విత్తనాలు వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. వర్షాలు ఆలస్యమయ్యే పరిస్థితుల్లో పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, వేరుశనగ, పెసర్లు, మినుములు, కందులు, సజ్జలు, జొన్నల లాంటి పంటలను సాగుచేయాలని కోరారు. 50 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు, 30-40 లక్షల ఎకరాల్లో వరి సాగుకు రైతులు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.


నేడు ఇక్రిశాట్‌లో మంత్రి తుమ్మల సమీక్ష

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో మంత్రి తుమ్మల సోమవారం ఇక్రిశాట్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు, ఇక్రిశాట్‌, ఐఐఓఆర్‌, ఐఐఎంఆర్‌, సీఆర్‌ఐడీఏ శాస్త్రవేత్తలు, ఐఎండీ అధికారులు, వ్యవసాయ, ఉద్యాన శాఖ, భూగర్భ జల విభాగం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Jul 13 , 2026 | 05:13 AM