బతుకమ్మ వేడుకలకు రూ.10 కోట్లు
ABN , Publish Date - Oct 09 , 2026 | 05:48 AM
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది.
అక్టోబరు 18న హైదరాబాద్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ
హైదరాబాద్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. 2026-27 బడ్జెట్‌లో భాషా, సాంస్కృతిక శాఖకు కేటాయించిన నిధుల నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేయనున్నారు. అక్టోబరు 10 నుంచి 18 వరకు తొమ్మిది రోజులపాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. వేడుకల ముగింపు సందర్భంగా అక్టోబరు 18న హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
ప్రతి గ్రామంలోనూ ఘనంగా బతుకమ్మ: సీతక్క
బతుకమ్మ సంబురాలను ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రతి కుటుంబం సంతోషంగా, సురక్షితంగా పండుగ జరుపుకునేందుకు ప్రజా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, జిల్లా పంచాయతీ అధికారులు, కలెక్టర్లు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బతుకమ్మ ఆడే ప్రదేశాలు, చెరువులు, కుంటలు, ఘాట్ల పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అవసరమైన చోట విద్యుత్ దీపాలు, తాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
టీజీవో మహిళా విభాగం బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీఓ) మహిళా విభాగం బతుకమ్మ పోస్టర్‌ను గురువారం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలను తమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని టీజీవో మహిళా ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఓల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివా్‌సరావు, బి.శ్యామ్, మహిళా విభాగం చైర్‌పర్సన్ డా.జి.దీపారెడ్డి, కన్వీనర్ జె.సుజాత తదితరులు పాల్గొన్నారు.