Share News

పంటల బోన్‌సకు 3,500 కోట్లు

ABN , Publish Date - Mar 21 , 2026 | 05:08 AM

ఈ ఏడాది బడ్జెట్‌లో పంటల బోన్‌సకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,500 కోట్లు కేటాయించింది. సన్న వడ్లకు బోనస్‌ చెల్లించేందుకు ప్రభుత్వం గత బడ్జెట్‌లో రూ.1800 కోట్లు కేటాయించింది.

పంటల బోన్‌సకు 3,500 కోట్లు

  • సన్న వడ్లతోపాటు ఇతర పంటలకూ బోనస్‌ ఇచ్చే అవకాశం

  • ఖరీఫ్‌లో పంటల బీమా పథకం!

  • ఆరోగ్య, ఆర్‌ అండ్‌ బీ, పౌర సరఫరాల శాఖలకు పెరిగిన బడ్జెట్‌

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది బడ్జెట్‌లో పంటల బోన్‌సకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,500 కోట్లు కేటాయించింది. సన్న వడ్లకు బోనస్‌ చెల్లించేందుకు ప్రభుత్వం గత బడ్జెట్‌లో రూ.1800 కోట్లు కేటాయించింది. ఈసారి కేటాయింపులు భారీగా పెరగ్గా ఖరీఫ్‌లో వరి, యాసంగిలో ఇతర పంటలకు కూడా బోనస్‌ ప్రకటించే అవకాశాలున్నాయి. సన్నాలకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ ఇచ్చేందుకు 2025-26 బడ్జెట్‌లో రూ.1,800 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. 39.08 లక్షల టన్నుల సన్నధాన్యానికి గాను రూ.1940 కోట్లు బోన్‌సగా చెల్లించింది. ఈ సారి కేటాయింపులు పెరగ్గా... సన్నాలతోపాటు మొక్కజోన్న, నూనె గింజలు, పప్పుధాన్యాలు తదితర పంటలకు కూడా బోనస్‌ ఇస్తారనే అభిప్రాయాలున్నాయి. అలాగే, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.344 కోట్లు కేటాయించింది. ఇక, రాష్ట్రంలో కొన్నేళ్లుగా నిలిచిపోయిన పంటల బీమా వచ్చే ఖరీఫ్‌లో పునఃప్రారంభమయ్యే అవకాశముంది. 2019-20 తర్వాత రాష్ట్రంలో పంటల బీమా అమలు నిలిచిపోగా.. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టం సంభవించినప్పుడు ఎకరానికి రూ.10 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లిస్తున్నారు. అయితే, 2026-27 బడ్జెట్‌లో పంటల బీమాకు ప్రభుత్వం రూ. 1,886 కోట్ల కేటాయించింది. దీంతో పంట బీమా పథకం తిరిగి అమలులోకి రానుంది. వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి పంటల బీమా పథకం అమలు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలిసింది. కాగా 2025- 26లో ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.275.81 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. దీనికి బదులుగా పంటల బీమా పథకాన్ని వచ్చే ఖరీఫ్‌ నుంచి అమలుచేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.

రైతుబీమా ఇక లేనట్లేనా?

రైతు బీమా పథకానికి బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేయలేదు. వచ్చే ఆగస్టు 14తో రైతు బీమా గడువు ముగుస్తుంది. పట్టాదారులైన రైతులు ఏ కారణంతో చనిపోయినా ఈ పథకం కింద రూ. 5 లక్షలు ఎల్‌ఐసీ ద్వారా చెల్లిస్తున్నారు. రైతుల తరపున ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించేది. అయితే, ఈసారి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కొత్తగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు బీమా చేయాలని, కుటుంబ యజమాని చనిపోతే 5లక్షల బీమా వచ్చేలా పథకం రూపొందిచారు. ఈ పథకం జూన్‌ 2 నుంచి పట్టాలెక్కుతోంది.అయితే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో 1 కోటి 15 లక్షల కుటుంబాలు కవర్‌ అవుతాయి. అందులో రైతు కుటుంబాలు కూడా ఉంటాయి. ఈక్రమంలోనే రైతుబీమాకు ఈసారి నిధులు కేటాయించలేదనే అంటున్నారు.


పౌర సరఫరాల శాఖకు పెరిగిన బడ్జెట్‌

పౌర సరఫరాల శాఖ బడ్జెట్‌ ఈసారి పెరిగింది. ధాన్యం కొనుగోళ్లు, సన్నధాన్యం బోనస్‌, సన్నబియ్యం పంపిణీ, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ తదితర కీలక పథకాలను పౌరసరఫరాలశాఖ అమలు చేస్తోంది. గత బడ్జెట్‌లో ఈ శాఖకు రూ.5,734 కోట్లు కేటాయించారు. ఈసారి ఆ బడ్జెట్‌ రూ.7,366కోట్లకు పెరిగింది. ఇందు లో మహాలక్ష్మి ఎల్‌పీజీ సబ్సిడీ పథకానికి రూ.723 కోట్లు కేటాయించారు. సన్నబియ్యం పంపిణీ పథకానికి సబ్సిడీ కింద రూ. 3 వేల కోట్లు కేటాయించారు.

హ్యామ్‌ రోడ్లకు పెరిగిన నిధులు

రోడ్లు, భవనాలశాఖ పరిధిలో ఉన్న పలు రోడ్లను హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌(హ్యామ్‌) విధానంలో అభివృద్ధి చేసేందుకు రూ.3,053 కోట్లు కేటాయించారు. నిరుడు రూ.300 కోట్లు కేటాయించగా.. ఈసారి కేటాయింపులు భారీగా పెరిగాయి. అర్‌ అండ్‌ బీ శాఖకు గత బడ్జెట్‌లో రూ. 5,907 కోట్లు కేటాయించగా.. ఈ బడ్జెట్‌లో రూ. 8,298 కోట్లు కేటాయించారు. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణ పరిహారానికి రూ.1,525 కోట్లు కేటాయించింది.

రైతుభరోసా కేటాయింపులు యథాతథం

రైతుభరోసా పథకానికి ప్రభుత్వం ఈసారి రూ.18 వేల కోట్లు కేటాయించింది. ఏడాదికి రెండు పంటలకు రైతు భరోసా చెల్లిస్తుండగా.. రెండు పంటలకు కలిపి ఒకేసారి బడ్జెట్‌ కేటాయింపులు చేసింది. ఎకరానికి రూ.6 వేల చొప్పున ఏడాదికి రూ.12 వేల పెట్టుబడి సాయం పంపిణీ చేసేందుకు గాను ఈ కేటాయింపులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర ఎకరాలకు ఈ నిధులు సరిపోతాయి. ఒక పంటకాలం(ఖరీఫ్‌)లో కోటిన్నర ఎకరాలకు రూ.9 వేల కోట్లు, రెండో పంటకు (యాసంగి) కూడా కోటిన్నర ఎకరాలకు రూ.9 వేల కోట్ల కేటాయింపులు చేయటం గమనార్హం. కాగా గత ఏడాది(2025- 26) బడ్జెట్‌లో కూడా ఇదే తరహాలో ప్రభుత్వం రూ.18 వేల కోట్ల కేటాయింపులు చేసింది.

ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం

వైద్య, ఆరోగ్యశాఖకు ప్రభుత్వం ఈ భారీగా కేటాయింపులు చేసింది. గత బడ్జెట్‌లో రూ.12,393 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ.13,679 కోట్లు కేటాయించింది. నిరుటితో పోలిస్తే రూ.1,286 కోట్లు(9.40శాతం) నిధులు పెరిగాయి. వైద్య విద్యకు పెద్దపీట వేసిన ప్రభుత్వం. ఒక్క వైద్యవిద్య సంచాలకుల విభాగానికే రూ.6,681 కోట్లు కేటాయించింది.

Updated Date - Mar 21 , 2026 | 05:08 AM