నేటి నుంచే బోనాలు
ABN , Publish Date - Jul 16 , 2026 | 05:59 AM
డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల నడుమ సంప్రదాయ వస్త్రాల్లో మహిళలు ఎంతో భక్తిప్రపత్తులతో బోనాలెత్తుకొని ఆలయాలకు కదిలే తరుణం వచ్చేసింది!
ఉత్సవాలకు రూ.20 కోట్లు!
నగరంలో 3వేల ఆలయాల్లో ఘనంగా నిర్వహణ
ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు: సీఎం రేవంత్
బ్రిక్స్ దేశాల మంత్రుల విందుకు హాజరైన ముఖ్యమంత్రి
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కేంద్ర కార్మిక శాఖ విందు
హైదరాబాద్, జూలై 15(ఆంధ్రజ్యోతి): డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల నడుమ సంప్రదాయ వస్త్రాల్లో మహిళలు ఎంతో భక్తిప్రపత్తులతో బోనాలెత్తుకొని ఆలయాలకు కదిలే తరుణం వచ్చేసింది! మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబంబించే బోనాల ఉత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఈ పండుగ సందర్భంగా జంట నగరాలకు చెందిన భక్తులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ ప్రజల జీవన విధానం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ బోనాల పండుగ కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదని, ఈ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక మహోత్సవం అని సీఎం అభివర్ణించారు. జంట నగరాల పరిధిలో జరిగే బోనాల ఉత్సవాలు, తెలంగాణ గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం అని, లౌకిక స్ఫూర్తిని చాటుతాయని సీఎం వెల్లడించారు. బోనాల ఉత్సవాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న సుమారు మూడు వేలకు పైగా దేవాలయాల్లో అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ. 20 కోట్లు కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కాగా హైదరాబాద్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సమ్మిట్-2026 కార్యక్రమం సందర్భంగా బుధవారం రాత్రి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఫలక్‌నుమా ప్యాలె్‌సలో అధికారిక విందును ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌మాండవియాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా, ఇండోనేసియా, చైనా, రష్యా, ఇరాన్, ఇథియోపియా, యూఏఈ, బ్రెజిల్ దేశాల మంత్రులను సీఎం రేవంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వివేక్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, సీఎంవో స్పెషల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, డీజీపీ సీ.వీ.ఆనంద్, కార్మిక శాఖ కార్యదర్శి దాసరి.హరిచందన తదితరులు పాల్గొన్నారు.