Share News

స్వచ్ఛ భారత్‌ కింద తెలంగాణకు 1,067 కోట్లు

ABN , Publish Date - Mar 24 , 2026 | 06:09 AM

స్వచ్ఛభారత్‌ మిషన్‌-అర్బన్‌ 2.0 కింద 2021-26 వరకు తెలంగాణకు రూ.1,067.3 కోట్లు కేటాయించినట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి టోఖన్‌ సాహు తెలిపారు.

స్వచ్ఛ భారత్‌ కింద తెలంగాణకు 1,067 కోట్లు

  • హైదరాబాద్‌ మెట్రో రెండో దశ ప్రాజెక్టుల ఆమోదానికి కాలపరిమితి విధించలేం..

  • కొత్తగూడెం, బసంత్‌నగర్‌ స్థలాలు ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు అనువుగా లేవు

  • రాజ్యసభలో కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛభారత్‌ మిషన్‌-అర్బన్‌ 2.0 కింద 2021-26 వరకు తెలంగాణకు రూ.1,067.3 కోట్లు కేటాయించినట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి టోఖన్‌ సాహు తెలిపారు. ఇందులో ఇప్పటివరకు రూ.993.40 కోట్ల కేంద్ర వాటాతో రూ.2,246.21 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆమోదం పొందాయని, ప్రస్తుతం స్వచ్ఛభారత్‌ మిషన్‌-అర్బన్‌ 2.0 కింద ఎటువంటి ప్రతిపాదన పెండింగ్‌లో లేదన్నారు. సోమవారం రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ రేణుకాచౌదరి అడిగిన ఓ ప్రశ్నకు సాహు సమాధానమిచ్చారు. హైదరాబాద్‌లో మురుగునీటి నిర్వహణకు అటల్‌ మిషన్‌ ఫర్‌ రిజువెనేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ (అమృత్‌ 2.0) పథకం కింద రూ.3,849.1 కోట్ల విలువైనమూడు మురుగు నీటి శుద్ధి ప్రాజెక్టులను ఆమోదించినట్లు చెప్పారు. హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందాయని తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టుల ఆమోదానికి ఏ కాలపరిమితి విధించలేమని.. ఎందుకంటే ప్రాజెక్టు సాఽధ్యసాధ్యాలు, నిధుల లభ్యతపై ఇది ఆధారపడి ఉంటుందని వివరించారు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం (పాల్వంచ) వద్ద విమానాశ్రయ అభివృద్ధికి ప్రతిపాదించిన స్థలం టెక్నో ఎకనామిక్‌ ఫిజిబిలిటీ రిపోర్టు (టీఈఎఫ్‌ఆర్‌) ప్రకారం అనువుగా లేదని తేలినట్లు విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్‌ మోహోల్‌ తెలిపారు. అలాగే చుట్టూ ఉన్న కొండల వల్ల బసంత్‌నగర్‌ (రామగుండం) స్థలం కూడా విమానాశ్రయ ఏర్పాటుకు అనువుగా లేదని తేలినట్లు చెప్పారు. రేణుకా చౌదరి అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈమేరకు సమాధానమిచ్చారు. ఇటు ఆదిలాబాద్‌ ఎయిర్‌ఫీల్డ్‌ భారత వైమానిక దళానికి చెందిందని.. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు ఆదిలాబాద్‌లో విమానాశ్రయ అభివృద్ధి కోసం ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా టెక్నో ఎకనామిక్‌ ఫిజిబిలిటీ స్టడీ (టీఈఎఫ్‌ఎస్‌) నిర్వహించిందన్నారు.

70 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు: కిషన్‌రెడ్డి

దేశంలో దాదాపు 70 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని.. బొగ్గు నిల్వల్లో భారత్‌ ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉందని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక బొగ్గు రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేశామని.. పారదర్శకంగా వేలం ద్వారా ఎలాంటి అవినీతికి తావు లేకుండా బొగ్గు బ్లాకులు కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడా విద్యుత్తు కొరత లేదని, విద్యుదుత్పత్తి కోసం 80 శాతం బొగ్గును సరఫరా చేస్తున్నామన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 06:09 AM