Telangana Govt: లైఫ్ సైన్సెస్ ఆర్థిక వ్యవస్థను250 బిలియన్ డాలర్లకు పెంచాలి
ABN , Publish Date - Jan 15 , 2026 | 06:05 AM
ప్రస్తుతం 80 బిలియన్ డాలర్లుగా ఉన్న తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఆర్థిక వ్యవస్థను 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు పెంచాలన్నదే లైఫ్‌సైన్సెస్ విధానం ప్రధాన లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
తెలంగాణ నెక్స్ జెన్ లైఫ్ సైన్సెస్
పాలసీ 2026-30 లక్ష్యం ఇదే
వెల్లడించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం 80 బిలియన్ డాలర్లుగా ఉన్న తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఆర్థిక వ్యవస్థను 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు పెంచాలన్నదే లైఫ్‌సైన్సెస్ విధానం ప్రధాన లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 2030 నాటికి ప్రపంచంలోని అత్యుత్తమ లైఫ్ సైౖన్సెస్ క్లస్టర్లను తెలంగాణలో అభివృద్ది చేయడంపై దృష్టి పెడతామని తెలిపింది. గ్రీన్ ఫార్మాసిటీ, ఫ్లాగ్‌షిప్ ఫార్మా విలేజెస్ కార్యక్రమాలతో గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా తెలంగాణ స్థానం మరింత బలోపేతం చేయాలని నిర్దేశించుకున్నట్లు పేర్కొంది. అదే సమయంలో ప్రపంచ ఆర్థిక వేదిక ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ సెంటర్ హైదరాబాద్‌లో స్థాపించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఇప్పటికే పేరు తెచ్చుకుని, 2,000పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు, వాటి సంయుక్త విలువ 80బిలియన్ డాలర్లతో దేశ ఔషధ ఉత్పత్తిలో 40శాతం వాటా తెలంగాణ కలిగి ఉందని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగం వేగంగా మార్పులు చెందుతున్న తరుణంలో.. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరణలకు కూడా నాయకత్వం వహించే దిశగా ఉండాలనే దృక్పథంతో ఉన్నామని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో, ప్రపంచ పరిశ్రమ నాయకులు, సీనియర్ ప్రభుత్వాధికారుల మధ్య దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో ఆవిష్కరించనున్నారు. ఇక భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న గ్రీన్‌ఫార్మా సిటీ.. ఏఐ హబ్ సహా ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలకు అనుసంధానాన్ని కల్పిస్తుందని పేర్కొంది. అధునాతన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ‘‘వర్క్, లివ్, లెర్న్ అండ్ ప్లే’’ విధానంలో ప్రాజెక్ట్ రూపకల్పన చేశామని ప్రభుత్వం తెలిపింది.