తెలంగాణ డీఎన్‌ఏలోనే వస్త్రకళ
ABN , Publish Date - Apr 04 , 2026 | 05:27 AM
తెలంగాణను 2047 నాటికి దక్షిణాసియాలోనే టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం ఆ రంగంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు భూమి.....
దక్షిణాసియాలోనే టెక్స్‌టైల్ రాజధానిగా తెలంగాణ.. 2047 నాటికి తీర్చిదిద్దాలన్నది లక్ష్యం
పత్తి ఉత్పత్తిలో అగ్రగామిగా రాష్ట్రం..
మన పత్తికి అంతర్జాతీయంగా పేరు
రాష్ట్రానికి ప్రధాన బలంగా నిలిచిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్
గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌లు అభివృద్ధి చేస్తాం
హైటెక్స్‌లో అటెక్సకాన్- 2026 సదస్సులో రేవంత్‌రెడ్డి కీలక ప్రసంగం
హైదరాబాద్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను 2047 నాటికి దక్షిణాసియాలోనే టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం ఆ రంగంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు భూమి, విద్యుత్, నీరు, తదితర మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలు కల్పించడంతోపాటు వేగవంతమైన అనుమతులు మంజూరు చేస్తామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన ఏషియన్ టెక్స్‌టైల్ కాన్ఫరెన్స్ -2026 (అటెక్సకాన్)లో ఆయన కీలక ప్రసంగం చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన టెక్స్‌టైల్ రంగ ప్రతినిధులకు తెలంగాణ, హైదరాబాద్ తరఫున ఆయన స్వాగతం పలికారు. ఈ సదస్సులో పాల్గొంటున్నవారు కేవలం అతిథులు మాత్రమే కాదని, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు, రాష్ట్ర విజన్‌ను పంచుకునే స్నేహితులని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి విధానాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు తెలంగాణ బలం అని అన్నారు. పత్తి పొలాల నుంచి లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్ ఫ్యాషన్ వేదికల వరకు తెలంగాణ రాష్ట్రం తనదైన ముద్ర వేసిందన్నారు. భారతదేశానికి అత్యుత్తమ వస్ర్తాల తయారీలో గొప్ప చరిత్ర ఉందని, శతాబ్దాలుగా కళలు, సంస్కృతి, సంప్రదాయాలు టెక్స్‌టైల్ రంగాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దాయని చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి పవిత్ర వస్ర్తాలను సమర్పించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు.
నిజాం కాలం నుంచే..
వస్త్రకళ అనేది తెలంగాణ డీఎన్‌ఏలోనే ఉందని సీఎం రేవంత్ అన్నారు. నిజాం కాలం నుంచే ప్రపంచ వ్యాపారులు హైదరాబాద్‌కు వచ్చి వస్ర్తాలు, ముత్యాలు కొనుగోలు చేసేవారని గుర్తుచేశారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ చీరలు, వరంగల్ దుర్రీస్, నారాయణపేట చేనేత వంటి సంప్రదాయ వస్ర్తాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. పత్తి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందని, ఇక్కడ పండే పత్తి నాణ్యతకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి పేరుందని తెలిపారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ రాష్ర్టానికి ప్రధాన బలంగా నిలుస్తోందన్నారు. హైదరాబాద్ గ్లోబల్ సినిమా నిర్మాణ కేంద్రంగా ఎదుగుతోందని, సినిమా రంగం, వారి ఫ్యాషన్‌ను కూడా తెలంగాణ టెక్స్‌టైల్ నుంచే పొందేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. యువతకు, ముఖ్యంగా మహిళలకు శిక్షణ ఇచ్చి, వారిలో సంప్రదాయం-ఆధునికత కలగలిపిన నైపుణ్యాలను పెంపొందిస్తామన్నారు. రానున్న రోజుల్లో ప్రపంచంలోని ప్రతి దేశంలో తెలంగాణలో తయారైన దుస్తులే ధరించేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. తమ దృష్టిలో ‘టెక్స్ టైల్’ అంటే కేవలం వ్యాపారం మాత్రమే కాదని, అట్టడుగున ఉన్న నేతన్నకు అందించే ‘సామాజిక న్యాయం’ అని అభివర్ణించారు. తెలంగాణలో టెక్స్‌టైల్ రంగం కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని, వేలాది కుటుంబాల జీవనాధారమని చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు.
తమ్మిడికుంట పనులు పరిశీలించిన సీఎం
ఐటీ కారిడార్‌లోని తమ్మిడికుంట చెరువు అభివృద్ధి పనులను సీఎం రేవంత్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం హైటెక్స్‌లో జరుగుతోన్న టెక్స్‌టైల్ సదస్సులో పాల్గొన్న అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో కాన్వాయ్‌ని ఆకస్మికంగా చెరువు వైపు మళ్లించారు. చెరువు చుట్టూ తిరిగి.. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. హైటెక్స్‌లో ఉన్న తమ్మిడికుంట చెరువు.. కబ్జాలతో 14 ఎకరాలకు కుచించుకుపోయింది. ప్రముఖ సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్ష్షన్.. కుంట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉందని గుర్తించి రెండెకరాల మేర హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. అనంతరం నాగార్జున ఆ స్థలాన్ని అభివృద్ధి కోసం ప్రభుత్వానికి అప్పగించారు. కుంటలో ఉన్న ఇతరత్రా ఆక్రమణలనూ తొలగించి.. 28.05 ఎకరాల విస్తీర్ణంలో చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఇందుకోసం రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు హైడ్రా వర్గాలు తెలిపాయి.