Minister Duddilla Sreeram Babu: గ్లోబల్ ఇన్నోవేషన్ క్యాపిటల్‌గా తెలంగాణ
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:36 AM
తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
బిట్స్ పిలానీ అల్యూమ్ని సమావేశంలో మంత్రి దుద్దిళ్ల
హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బిట్స్ పిలానీ- హైదరాబాద్ క్యాంప్‌సలో శనివారం నిర్వహించిన ‘బిట్స్ అల్యూమ్ని అసోసియేషన్ గ్లోబల్ మీట్ 2026’ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. టెక్నాలజీ కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా, దేశసేవకు, ఆత్మ నిర్భరతకు ఉపయోగపడాలన్నారు. ఇతర దేశాల మాదిరిగా భారత్ ప్రైవేట్ గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహించకుండా, ఆధార్, యూపీఐ వంటి ‘డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ ద్వారా ప్రపంచానికి దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఏఐ ఆధారిత ‘తెలంగాణ డేటా ఎక్స్‌చేంజ్’.. పరిశోధనలకు గొప్ప ఊతమిస్తోందరి తెలిపారు. త్వరలో ప్రారంభించబోయే తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ యూనివర్సిటీ గేమ్ చేంజర్‌గా మారి ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తాయన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం తదితర రంగాల్లోని సమస్యలకు పరిష్కారం చూపేలా ‘ఏఐ’ పరిశోధనలు జరగాలని కోరారు. తెలంగాణ రైజింగ్‌లో భాగస్వామ్యం కావాలని బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థులను, యాజమాన్యాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు.