Share News

రాష్ట్రంలో పీపీపీ పద్ధతిని ప్రోత్సహించండి

ABN , Publish Date - Mar 13 , 2026 | 05:14 AM

2027 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం ‘ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య....

రాష్ట్రంలో పీపీపీ పద్ధతిని ప్రోత్సహించండి

  • మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనే లక్ష్యం: భట్టి

  • డేటా సెంటర్లలో ఏఐ వినియోగాన్ని పెంచాలి: మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): 2027 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం ‘ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ)’ పద్ధతిని ప్రోత్సహించేలా ప్రణాళికలు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. బడ్జెట్‌ సన్నాహక సమావేశాల్లో భాగంగా హోంశాఖ, పరిశ్రమలు-ఐటీ శాఖల ప్రతిపాదనలపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమి(క్యూర్‌), పెరి అర్బన్‌ రీజియన్‌ ఎకానమి(ప్యూర్‌)తో పాటు రూరల్‌ అగ్రి రీజియన్‌ ఎకానమి(రేర్‌)కి కూడా సమ ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. రేర్‌ పరిధిలో పెద్దఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చేలా ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)ను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది ప్రజా ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. శాంతిభద్రతల అంశంలో ఏ చిన్న పొరపాటుకు హోంశాఖ అధికారులు, సిబ్బంది అవకాశం ఇవ్వరాదని స్పష్టం చేశారు. పోలీసు శాఖలో దశలవారీగా ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ) వినియోగాన్ని పెంచుతున్నామన్నారు. కాగా, 41 గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్ల(జీసీసీ)తో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, ఇదే వేగాన్ని కొనసాగించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా అన్నారు. డేటా సెంటర్లలో కృత్రిమ మేధ(ఏఐ) వినియోగాన్ని పెంచాలని అధికారులకు సూచించారు.

Updated Date - Mar 13 , 2026 | 05:14 AM