Share News

Telangana AI Innovation Hub: తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్‌ హబ్‌ దావోస్‌ వేదికగా ప్రారంభం

ABN , Publish Date - Jan 17 , 2026 | 06:41 AM

ఇప్పటిదాకా భారత టెక్నాలజీ రంగానికి కేంద్రంగా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు ప్రపంచ నూతన ఆవిష్కరణల రాజధానిగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.

Telangana AI Innovation Hub: తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్‌ హబ్‌ దావోస్‌ వేదికగా ప్రారంభం

  • ఈనెల 20న కార్యక్రమం.. హాజరుకానున్న ప్రపంచ ప్రముఖులు

  • ప్రపంచంలోనే తొలి ఏఐ ప్రయోగ వేదికగా టీఏఐహెచ్‌

  • తెలంగాణను ఏఐలో గ్లోబల్‌ లీడర్‌గా నిలపడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ఇప్పటిదాకా భారత టెక్నాలజీ రంగానికి కేంద్రంగా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు ప్రపంచ నూతన ఆవిష్కరణల రాజధానిగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. దావోస్‌లో తాము కేవలం పెట్టుబడులు మాత్రమే అడగడం లేదని, భాగస్వామ్యాల కోసం స్నేహహస్తం చాస్తున్నామని వివరించారు. ప్రతిభ, నూతన ఆవిష్కరణలకు మేలు కలయికగా ఉన్న తెలంగాణలో ‘ఏఐ’ భవిష్యత్తును నిర్మించడానికి ప్రపంచదేశాలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశంలో పాల్గొనటానికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్తున్నారు. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్‌ హబ్‌ (టీఏఐహెచ్‌) ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈనెల 20న దావోస్‌లోనే నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో దావోస్‌లో సీఎం పర్యటన లక్ష్యాలను ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో తెలంగాణను గ్లోబల్‌ లీడర్‌గా నిలబెట్టే దిశలో ‘తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్‌ హబ్‌ (టీఏఐహెచ్‌)’ను దావోస్‌ వేదికగా ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ఏఐ ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన స్వతంత్ర సంస్థగా టీఏఐహెచ్‌ పని చేస్తుందని.. ఇది ప్రపంచంలోనే తొలి ఏఐ ప్రయోగ వేదికగా నిలుస్తుందని వెల్లడించింది. నాలుగు వ్యూహాత్మక స్తంభాలైన టాలెంట్‌ ఫౌండ్రీ, ఇన్నోవేషన్‌ ఇంజిన్‌, క్యాపిటల్‌ ఫ్లైవీల్‌, ఇంపాక్ట్‌ ల్యాబ్స్‌పై పనిచేస్తుందని తెలిపింది. ఏఐ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, చిప్‌ డిజైన్‌ వంటి డీప్‌టెక్‌ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు చోదక శక్తిగా పని చేసేలా టీఏఐహెచ్‌ను రూపొందించినట్టు వెల్లడించింది. డీప్‌-టెక్‌ భవిష్యత్తుకు స్వాగతం పలికేలా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఇన్నోవేషన్‌-ఫస్ట్‌ దృక్పథాన్ని ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రదర్శించనున్నట్టు తెలిపింది.


అత్యాధునిక ఆవిష్కరణల వేదిక..

టీఏఐహెచ్‌ ద్వారా మౌలిక సదుపాయాలతో డీప్‌టెక్‌ రంగాలలో అత్యాధునిక ఆవిష్కరణలకు వేదికను సిద్ధం చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు పేర్కొన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ సంస్థల రూపకల్పన, సులువుగా నిర్వహణకు అనుకూలమైన విధంగా పునర్నిర్మించడం, వేగవంతమైన ప్రయోగాలు, వేగవంతమైన అమలు, ప్రైవేట్‌ రంగంతో లోతైన భాగస్వామ్యాన్ని టీఏఐహెచ్‌ సాధ్యం చేస్తుందని తెలిపింది. టీఏఐహెచ్‌ రూపకల్పనలోనే ప్రత్యేక సామర్థ్యం ఉందని.. వేగవంతమైన సృజనాత్మకతలను ఇది సాధ్యం చేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నట్టు ప్రకటనలో తెలిపింది. ఇక అత్యాధునిక ఏఐ మోడల్స్‌, క్వాంటమ్‌ టెక్నాలజీలు, అధునాతన సెన్సార్‌ ప్లాట్‌ఫామ్‌లు, సూపర్‌ హ్యూమన్‌ ఇంటెలిజెన్స్‌ వంటి సరికొత్త యుగంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ప్రపంచంలో టాప్‌-20 ఇన్నోవేషన్‌ హబ్‌లలో ఒకటిగా తెలంగాణను నిలపడం తమ లక్ష్యమని టీఏఐహెచ్‌ సీఈఓ ఫణి నాగార్జున పేర్కొన్నట్టు వెల్లడించింది.

పెద్ద సంఖ్యలో ప్రముఖుల హాజరు

తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్‌ హబ్‌ అధికారిక ప్రారంభ కార్యక్రమం ఈ నెల 20న సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దావోస్‌లో మౌంటేన్‌ ప్లాజా హోటల్‌లో జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. పలువురు ప్రభుత్వాధినేతలు, పరిశ్రమల అధినేతలు, టెక్నాలజీ రంగ ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపింది.

Updated Date - Jan 17 , 2026 | 06:41 AM