Share News

వ్యవసాయ అధ్యాపకుల పదవీవిరమణ వయసు పెంచండి

ABN , Publish Date - Jun 25 , 2026 | 04:27 AM

దేశంలో 60శాతం మందికి ఉపాధి కల్పించే వ్యవసాయరంగానికి వ్యవసాయ వర్సిటీ అధ్యాపకులు దిక్సూచి అని.. మేలైన, అధిక దిగుబడినిచ్చే....

వ్యవసాయ అధ్యాపకుల పదవీవిరమణ వయసు పెంచండి

  • అనుభవం, పరిశోధన నైపుణ్యాన్ని ప్రయోజనకరంగా వినియోగించుకోండి

  • దక్షిణాది రాష్ట్రాల్లోని వర్సిటీల్లో 60ఏళ్ల కంటే ఎక్కువగా రిటైర్మెంట్‌ వయసు

  • ప్రభుత్వానికి వ్యవసాయ వర్సిటీ సీనియర్ల విజ్ఞప్తి

హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): దేశంలో 60శాతం మందికి ఉపాధి కల్పించే వ్యవసాయరంగానికి వ్యవసాయ వర్సిటీ అధ్యాపకులు దిక్సూచి అని.. మేలైన, అధిక దిగుబడినిచ్చే వంగడాలను సృష్టించగలిగే అనుభవమున్న ఆ అధ్యాపకులు పదవీ విరమణ వయసు పెంచాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీలో ఇప్పటికే మూడో వంతుకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రిటైర్మెంట్లతో మరిన్ని ఖాళీలు ఏర్పడి వ్యవసాయ విద్యార్థులకు బోధన, పరిశోధనలకు ఇబ్బంది తప్పదని అధ్యాపకులు చెబుతున్నారు. ఏపీలో, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో అధ్యాపకుల రిటైర్మెంట్‌ వయసు 60ఏళ్లకుపైగానే ఉందని.. రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ అధ్యాపకుల వయో పరిమితిని 60 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచాలని కోరుతున్నారు.

రిటైర్మెంట్లతో పెరుగుతున్న ఖాళీలు

ప్రస్తుతం వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో మొత్తం 787 అధ్యాపక పోస్టులు ఉన్నాయి. వాటిలో భర్తీ అయిన పోస్టులు 474కాగా.. 313 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 159, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 154 ఖాళీగా ఉండటం గమనార్హం. ఇక పోస్టుల నిష్పత్తి కూడా 1:2:4 (ఒక ప్రొఫెసర్‌, ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంటు ప్రొఫెసర్లు) ప్రకారం ఉండాలి. కానీ ఆ ప్రకారం సిబ్బంది లేరు. పైగా కొన్నిరోజుల్లో మరో 18 మంది ప్రొఫెసర్లు పదవీ విరమణ చేయనున్నారు. వచ్చే ఐదేళ్లలో 58 మంది రిటైర్‌ అవుతారు. దీనితో ఖాళీల సంఖ్య మరింత పెరగనుంది. ఈ క్రమంలో వ్యవసాయ వర్సిటీలో అధ్యాపకుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలని కోరుతూ.. వర్సిటీ సీనియర్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌కు తాజాగా వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ వర్సిటీతోపాటు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఇతర వర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలు, వేతనాలు, పదోన్నతులు యూజీసీ నిబంధనల మేరకే జరుగుతున్నాయని.. ఈ క్రమంలో రాష్ట్రంలో అన్ని వర్సిటీల్లో ఒకే విధానం అమలుచేయాలని కోరారు. కాళోజీ వర్సిటీలో రిటైర్మెంట్‌ వయసు 65 ఏళ్లుగా ఉందని గుర్తు చేశారు. అంతేగాకుండా అగ్రానమీ, నేల ఆరోగ్యం, ఆగ్రోమెటిరాలజీ, మొక్కల తెగుళ్లు, విత్తనాభివృద్ధి, వ్యవసాయ ఆర్థికశాస్త్రం, వ్యవసాయ విస్తరణ, పశువైద్య శాస్త్రం తదితర అంశాల్లో అపార అనుభవం ఉన్న వ్యవసాయ అధ్యాపకుల సేవలు ఎంతో అవసరమని వివరించారు. పంటల వైవిధ్యీకరణ, వాతావరణ హెచ్చరికలు, చీడపీడల నివారణ, సాంకేతికత బదిలీ, ధరల విశ్లేషణ లాంటి అంశాల్లో వారి సేవలు రైతులకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. 58 మంది పదవీ విరమణ వయసు ఐదేళ్లు పెంచితే ఏటా రూ.7.56 కోట్ల మేర మాత్రమే ప్రభుత్వంపై అదనపు భారం ఉంటుందని.. కానీ ప్రయోజనాలు ఎంతగానో ఉంటాయని వివరించారు.

Updated Date - Jun 25 , 2026 | 04:27 AM