పంటల కొనుగోలులో కేంద్రం వివక్ష సరైంది కాదు: తుమ్మల
ABN , Publish Date - Jun 16 , 2026 | 04:52 AM
కొత్త గోదాముల విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వాటిని కేంద్రమే నిర్మించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి) : కొత్త గోదాముల విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వాటిని కేంద్రమే నిర్మించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. పంటల కొనుగోళ్లు, మార్పిడి అంశాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల మార్పిడిని ప్రాధాన్యంగా తీసుకుందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు ఆలోచన చేయాలన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని పంటలను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. పంటల కొనుగోలు విషయంలో కేంద్రం తన బాధ్యతను వదిలేసి రాష్ట్రాలపై భారం మోపడం సమంజసం కాదన్నారు. రాష్ట్రం కొనుగోలు చేసిన 15 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు, 2 లక్షల మెట్రిక్ టన్నుల జొన్నలను కేంద్రమే తీసుకోవాలని చెప్పారు. పంటల కొనుగోలులో కేంద్రం వివక్ష సరైంది కాదన్నారు.