చిన్న ఇంజిన్.. పెద్ద ముందడుగు
ABN , Publish Date - Apr 05 , 2026 | 06:43 AM
పునర్వినియోగ అంతరిక్ష వాహనాలను (రాకెట్ లాంచ్ వెహికల్స్‌ను), అత్యాధునిక ప్రొపల్షన్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్న శామీర్‌పేట్‌లోని అబ్యోమ్ స్పేస్‌టెక్ అండ్ డిఫెన్స్ కంపెనీ తాజాగా మరో మైలురాయిని దాటింది.
విజయవంతంగా బీఎస్ఈ-2 రాకెట్ ఇంజిన్ హాట్ ఫైర్ టెస్ట్
సొంతంగా అభివృద్ధి చేసి పరీక్షించిన అబ్యోమ్ స్పేస్‌టెక్
బిట్స్ పిలానీ, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): పునర్వినియోగ అంతరిక్ష వాహనాలను (రాకెట్ లాంచ్ వెహికల్స్‌ను), అత్యాధునిక ప్రొపల్షన్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్న శామీర్‌పేట్‌లోని అబ్యోమ్ స్పేస్‌టెక్ అండ్ డిఫెన్స్ కంపెనీ తాజాగా మరో మైలురాయిని దాటింది. బీఎ్‌సఈ-2 లిక్విడ్ రాకెట్ ఇంజిన్ హాట్ ఫైర్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ రాకెట్ ఇంజిన్‌ను సొంతంగా తయారు చేయడమేగాక పరీక్షలను కూడా తమ కంపెనీలోనే నిర్వహించడం విశేషం. ఫ్లైట్ రెడీ ఇంజిన్ (ఎఫ్‌ఆర్ ఈ) అభివృద్ధి కార్యక్రమంలో ఇది అతిపెద్ద ముందడుగుగా కంపెనీ ప్రతినిధులు అభివర్ణిస్తున్నారు. సాధారణంగా రాకెట్ ఇంజిన్ అంటే పెద్దదిగానే ఉంటుంది. కానీ, అబ్యోమ్ రూపొందించిన ఇంజిన్ 2.5 కిలోన్యూటన్ సామర్థ్యం గల చిన్న లిక్విడ్ రాకెట్ ఇంజిన్. ఈ చిన్న ఇంజిన్ భవిష్యత్తులో పెద్ద రాకెట్ల అభివృద్ధికి పునాది వేస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. కాగా, హాట్‌ఫైర్ పరీక్షలో భాగంగా ఇంజిన్‌ను సుమారు ఆరు సెకన్ల పాటు మండించారు. ఈ సమయంలో దహనం స్థిరంగా కొనసాగడమేగాక పీడనం, ఉష్ణోగ్రతలు కూడా సరిగ్గా నమోదయ్యాయి. సుమారు 2,200 డిగ్రీల సెల్సియ్‌సను మించిన చాంబర్ ఉష్ణోగ్రతలు, డిజైన్ అంచనాలకు అనుగుణంగా పనితీరు ఉందని కంపెనీ వెల్లడించింది. బీఎ్‌సఈ-1 ఇంజిన్‌కు సంబంధించి తాము నమోదు చేసిన విజయాలకు కొనసాగింపుగా బీఎ్‌సఈ-2ని పరీక్షించామని తెలిపింది. ము ఖ్యంగా పునర్వినియోగం, థ్రోటెల్ ఫ్లయిట్ ఇంజిన్ కోసం అవసరమైన కీలకమైన సాంకేతికతలను పరీక్షించినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. దీనిలోని పింటెల్ ఇంజెక్షన్ మెకానిజం వర్టికల్ టేకాఫ్, వర్టికల్ ల్యాండింగ్ కార్యకలాపాలకు తోడ్పడుతుందన్నారు. త్వరలో క్రయోజెనిక్ ఇంజిన్‌ను అభివృద్ధి చేయడంతో పాటు భారతదేశపు తొలి ప్రిసిషన్ గైడెన్స్, అటానమస్ లాంచ్, రికవరీ ఆటోమేటెడ్ వీటీవీఎల్ డిమాన్‌స్ట్రేటర్‌లను అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. అబ్యోమ్ స్పేస్‌టెక్ అండ్ డిఫెన్స్ కంపెనీ.. శామీర్‌పేట్‌లోని బిట్స్‌పిలాని- హైదరాబాద్‌తో సంయుక్తంగా పలు ప్రాజెక్టులు చేపట్టింది.