శాటిలైట్ మ్యాపింగ్‌తో సమగ్ర పంటల ప్రణాళిక
ABN , Publish Date - Apr 05 , 2026 | 06:36 AM
పంటల సమగ్ర ప్రణాళికకు శాటిలైట్ మ్యాపింగ్ దిక్సూచి కావాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
పంట నష్టాల అంచనాలో పారదర్శకత: మంత్రి తుమ్మల
హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): పంటల సమగ్ర ప్రణాళికకు శాటిలైట్ మ్యాపింగ్ దిక్సూచి కావాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శాటిలైట్ డేటా ఆధారంగా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడం అత్యవసరమన్నారు. ఈ ప్రణాళికకు పంటల అంచనా, దిగుబడి (ఉత్పత్తి), డిమాండ్, మార్కెటింగ్, సరఫరా వ్యవస్థ, గిడ్డంగుల సదుపాయాలు, పంటల నష్టం అంచనాతోపాటు పంటల బీమా తదితర అంశాలు అనుసంధానమై ఉంటాయన్న తుమ్మల.. వీటన్నింటి సమన్వయంలో శాటిలైట్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత సమర్థవంతంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో శాటిలైట్ మ్యాపింగ్ చేపడుతున్నామని ఆయన తెలిపారు. వ్యవసాయశాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులతో శాటిలైట్ క్రాప్ మ్యాపింగ్‌పై శనివారం సమీక్షించారు. శాటిలైట్ మ్యాపింగ్‌తో ప్రతి సీజన్‌లోనూ వర్షాభావ పరిస్థితులు, సాగులో ఉన్న పంటల రకాలు, దిగుబడి అంచనాలు, గిడ్డంగుల వసతులపై ముందే స్పష్టత లభిస్తుందని చెప్పారు. తత్ఫలితంగా రైతులకు సమయానుకూల సూచనలు చేయడంతోపాటు అవసరమైన చర్యలను వేగవంతం చేయడానికి వ్యవసాయశాఖకు సులభతరం అవుతుందన్నారు.