Share News

ఉద్యమకారులందరికీ న్యాయం

ABN , Publish Date - Jun 29 , 2026 | 05:08 AM

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పని చేసిన తొలిదశ , మలిదశ ఉద్యమకారులతోపాటు ఉద్యమంలో పాల్గొన్న చివరి ఉద్యమకారుని వరకు న్యాయం ...

ఉద్యమకారులందరికీ న్యాయం

  • బీఆర్‌ఎస్‌ ఉద్యమకారులను మోసం చేసింది

  • ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జూపల్లి

కవాడిగూడ, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పని చేసిన తొలిదశ , మలిదశ ఉద్యమకారులతోపాటు ఉద్యమంలో పాల్గొన్న చివరి ఉద్యమకారుని వరకు న్యాయం చేసేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ పిడమర్తి రవి అధ్యక్షతన ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు,. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తరువాత కేసీఆర్‌ రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులను, ప్రాణ త్యాగం చేసిన వారిని విస్మరించి ఎన్నికల్లో ఓడిపోయిన తన కూతురు కవితకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారన్నారు. బీఆర్‌ఎస్‌ ఉద్యమకారులను మోసం చేసిందన్నారు. కేసీఆర్‌ హయాంలో ఆయన కుటుంబసభ్యులకు మాత్రమే న్యాయం జరిగిందన్నారు. కాంట్రాక్టులను ఆంధ్ర పెట్టుబడిదారులకు అప్పగించి ఆస్తులను పెంచుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడి వివరాలు సేకరించి వారిని గుర్తించేందుకు ఆ కమిటీ పనిచేస్తుందని చెప్పారు. ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Jun 29 , 2026 | 05:08 AM