Share News

తెలంగాణ న్యాయవాదులకే హైకోర్టు జడ్జి పదవులు ఇవ్వాలి

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:59 AM

తెలంగాణ స్థానికత కలిగిన న్యాయవాదులకే హైకోర్టు జడ్జి పదవులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది.

తెలంగాణ న్యాయవాదులకే హైకోర్టు జడ్జి పదవులు ఇవ్వాలి

  • అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌

  • ఆంధ్ర స్థానికత ఉన్న లాయర్ల పేర్లు సిఫార్సుపై అభ్యంతరం

హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్థానికత కలిగిన న్యాయవాదులకే హైకోర్టు జడ్జి పదవులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన సిఫార్సుల జాబితాలో ఆంధ్ర స్థానికత కలిగిన న్యాయవాదుల పేర్లు ఉండడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయమై అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.సురేందర్‌ రెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం శనివారం టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌ రావులను కలిసి వినతిపత్రం అందజేసింది. నియామకాల్లో స్థానిక న్యాయవాదులకు అన్యాయం జరుగుతోందని తెలిపింది. స్థానికులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరింది. ఈ విషయమై ఈనెల 16న సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మాన ప్రతిని కూడా సమర్పించింది. ఇరువురు నేతలు సానుకూలంగా స్పందించి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని రామచందర్‌రావు అన్నారని చెప్పారు. సీఎం, రాహుల్‌ గాంధీల దృష్టికి తీసుకువెళ్తానని మహేష్‌ గౌడ్‌ హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు డి.ఎల్‌. పాండు, కార్యదర్శులు పి. శ్రవణ్‌ కుమార్‌ గౌడ్‌, నిరంజన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 04:59 AM