అదనపు తహసీల్దార్లు
ABN , Publish Date - May 29 , 2026 | 04:06 AM
వేగంగా విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాలకు రెవెన్యూ సేవలను సమర్థవంతంగా అందించేందుకు వీలుగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
లక్ష జనాభా దాటిన అర్బన్ మండలాలకు నియామకం
ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీసీఎల్‌ఏ ఉత్తర్వుల జారీ
పట్టణీకరణతో తహసీల్దార్లపై పని భారం పెరుగుతున్న నేపథ్యంలో కొత్త పోస్టులు
నాయబ్ తహసీల్దార్లకే అదనపు తహసీల్దార్‌గా పోస్టింగ్
పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని అంచనా
హైదరాబాద్, మే 28 (ఆంధ్రజ్యోతి): వేగంగా విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాలకు రెవెన్యూ సేవలను సమర్థవంతంగా అందించేందుకు వీలుగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్ష జనాభా దాటిన మండలాల్లో అదనపు తహసీల్దార్ పోస్టులను ఏర్పాటు చేస్తూ ప్రధాన భూపరిపాలన కమిషనర్ (సీసీఎల్‌ఏ) ఉత్తర్వులు జారీ చేశారు. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణతో మండలానికి ఉన్న ఒక తహసీల్దార్‌పై పని భారం పెరిగింది. ఫలితంగా భూ వివాదాలు, ఫిర్యాదులు, కోర్టు కేసులు, ప్రజాసేవల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అదనపు తహసీల్దార్ల నియామకానికి నిర్ణయం తీసుకుంది. భూభారతి దరఖాస్తుల పరిష్కారం, ఎన్నికల పనులు, ప్రజాపంపిణీ వ్యవస్థ పర్యవేక్షణ, వ్యవసాయ గణాంకాల నమోదు వంటి బాధ్యతలను తహసీల్దార్లు నిర్వహిస్తున్నారు. కొత్తగా నియమించే అదనపు తహసీల్దార్లకు సాగు నీటి వనరుల పరిశీలన, ఎన్నికల నిర్వహణ, కుల, ఆదాయ, స్థానిక నివాస ధ్రువపత్రాల జారీ, భూ ఆక్రమణల తొలగింపు, విపత్తు సహాయక చర్యలు, భూ సేకరణ కేసుల పర్యవేక్షణ వంటి బాధ్యతలను అప్పగించేలా జాబ్‌చార్ట్‌ను రూపొందించారు. మొత్తం నాలుగు జోన్ల పరిధిలో పలు పట్టణాలు, మండలాలకు అదనపు తహసీల్దార్ పోస్టులు మంజూరు చేశారు. వీటిలో మంచిర్యాల, మందమర్రి, పెద్దపల్లి, రామగుండం, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉత్తర, దక్షిణ మండలాలు, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, ఖిలా వరంగల్, పాల్వంచ, కాజీపేట్, హనుమకొండ, హసన్‌పర్తి, ఖమ్మం అర్బన్, మహబూబాబాద్ మొదలైనవి ఉన్నాయి. కొన్ని మండలాల్లో జనాభా రెండు లక్షలు దాటడంతో పరిపాలనా పరంగా వికేంద్రీకరణ అవసరం అయిందని అధికారులు చెప్పారు.
వ్యతిరేకిస్తున్న రెవెన్యూ ఉద్యోగ సంఘాలు
లక్ష జనాభా దాటిన అర్బన్ మండలాల్లో నాయబ్ తహసీల్దార్లను (డిప్యూటీ తహసీల్దార్) అదనపు తహసీల్దార్‌గా నియమించారు. అదే పేస్కేల్‌తో వీరు సేవలు అందించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజలకు సత్వర సేవలు అందించడంతోపాటు భూభారతి వ్యవహారాల్లో పారదర్శకతను పెంచడం, పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించడానికి ఈ నియామకాలు తోడ్పడుతాయని సీసీఎల్‌ఏ ఆశిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో భూముల విలువలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం అధికారులకు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. అయితే, ఈ నిర్ణయాన్ని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఒకే కార్యాలయంలో ఇద్దరు తహసీల్దార్లు పని చేయడానికి అవసరమైన మౌలిక వసతులు లేవని, దీనిని ఎలా సర్దుబాటు చేస్తారని ప్రశ్నిస్తున్నాయి. క్యాడర్ స్ట్రెంత్ పెంచకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఈ అదనపు తహసీల్దార్ పోస్టులకు వేతనాల చెల్లింపులో ఆర్థిక శాఖ కొర్రీలు వేసే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు. మరోవైపు, హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం కోర్ అర్బన్ పరిధిలో సుమారు 42 తహసీల్దార్ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ కూడా పని భారం అధికంగా ఉంది. జనాభా కోటీ నలభై లక్షలు దాటిందని.. ఇక్కడి అవసరాలకు కూడా అదనపు తహసీల్దార్ల నియామకం జరపాలన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.