కొత్తగా 416 డయాలసిస్ పడకలు
ABN , Publish Date - Jul 21 , 2026 | 04:49 AM
తెలంగాణ వ్యాప్తంగా 79 సర్కారీ దవాఖానాల్లో 416 డయాలసిస్ పడకలను కొత్తగా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రక్త శుద్ధి కోసం ఎదురుచూస్తున్న రోగులకు ఇది ఊరట కలిగించే విషయం.
79 సర్కారీ దవాఖానాల్లో ఏర్పాటు
టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వ్యాప్తంగా 79 సర్కారీ దవాఖానాల్లో 416 డయాలసిస్ పడకలను కొత్తగా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రక్త శుద్ధి కోసం ఎదురుచూస్తున్న రోగులకు ఇది ఊరట కలిగించే విషయం. కొత్త బెడ్ల ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాలభివృద్ధి సంస్థ(టీజీఎంఎస్ఐడీసీ) తాజాగా టెండర్లు పిలిచింది. ప్రయివేటు భాగస్వామ్యంతో వీటిని నిర్వహిస్తారు. హబ్ అండ్ స్పోక్ నమూనాలో ప్రాజెక్ట్‌ను నిర్వహించేందుకు అంతర్జాతీయ, జాతీయ స్థాయి అర్హత కలిగిన సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించారు. గ్రామీణ, జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో ఏర్పాటయ్యే ఈ డయాలసిస్ కేంద్రాలు(స్పోక్స్) రాష్ట్రంలోని ప్రధాన బోధనాసుపత్రులైన గాంధీ, నిమ్స్, ఉస్మానియా(హబ్‌లు) ఆస్పత్రుల వైద్య నిపుణుల పర్యవేక్షణలో పని చేస్తాయి. 5 ఏళ్ల పాటు ప్రయివేటు కంపెనీతో ఒప్పందం ఉంటుంది. పనితీరు ఆధారంగా మరో 3 ఏళ్లు పొడిగించవచ్చు. ఒప్పందం కుదుర్చుకున్న 60 రోజుల్లోగా సేవలు ప్రారంభించాలి. ప్రతి డయాలసిస్ సెషన్‌కు కొత్త డయాలసిజర్, ఏవీ బ్లడ్ ట్యూబింగ్, ట్రాన్స్‌డ్యూసర్ ప్రొటెక్టర్‌లను వాడాలి. డయాలసిస్ యంత్రాలు, ఆర్‌ఓ ప్లాంట్లు 90ు రన్నింగ్ కండిషన్‌లో ఉండాలి. ప్రతీ కేంద్రంలో నిపుణులైన సాంకేతిక సిబ్బంది, ఆర్‌ఓ ప్లాంట్లు, కాన్సుమబుల్స్‌తో పాటు పేషెంట్ డేటా మేనేజ్‌మెంట్ కోసం వెబ్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను సర్వీస్ ప్రొవైడరే ఏర్పాటు చేయాలి.
కనీసం 2 ఏళ్ల పాటు డయాలసిస్ సేవలు అందించిన అనుభవం ఉండాలి. గతంలో కనీసం 6 నెలల పాటు 100 హేమోడయాలసిస్ యంత్రాలను విజయవంతంగా నిర్వహించి ఉండాలి. రూ.25 కోట్ల సగటు వార్షిక టర్నోవర్ కలిగి ఉండాలి. హైదరాబాద్‌లోని సనత్‌నగర్ టిమ్స్‌లో 10 పడకలతో కొత్త డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. గాంధీ ఆస్పత్రి పరిధిలో 31 ఆస్పత్రుల్లో 165 పడకలు, నిమ్స్ పరిధిలో 35 ఆస్పత్రుల్లో 180 బెడ్స్, ఉస్మానియా పరిధిలోని 13 ఆస్పత్రుల్లో 71 బెడ్స్ అందుబాటు లోకి వస్తాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 102 డయాలసిస్ కేంద్రాలున్నాయి. వీటిలో సుమారు 845 వరకు బెడ్స్ ఉన్నాయి. 15,600 మంది క్రానిక్ కిడ్నీ రోగులుండగా, ఆరోగ్యశ్రీ లెక్కల ప్రకారం సర్కారీ రక్తశుద్ది కేంద్రాల్లో 14,156 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు.