Share News

జీఎస్‌టీ వసూళ్లలో తెలంగాణ రికార్డు

ABN , Publish Date - May 02 , 2026 | 05:43 AM

తెలంగాణలో రాష్ట్ర వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏకంగా రూ.4,621 కోట్లు వసూలయ్యాయి.

జీఎస్‌టీ వసూళ్లలో తెలంగాణ రికార్డు

  • ఏప్రిల్‌లో రూ.4,621 కోట్ల వసూలు.. గతేడాది ఏప్రిల్‌ కంటే 35 శాతం వృద్ధి

  • 4 నెలలుగా 4వేల కోట్లకు పైగా వసూళ్లు

  • రాష్ట్రంలోని పన్ను చెల్లింపుదారుల నుంచి మూడు జీఎస్‌టీల కింద 7,181 కోట్లు

  • ఇందులో రెండో స్థానంలో తెలంగాణ

హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రాష్ట్ర వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏకంగా రూ.4,621 కోట్లు వసూలయ్యాయి. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈసారి 35 శాతం వృద్ధి నమోదైంది. అంతేకాదు.. గత నాలుగు నెలలుగా రూ.4 వేల కోట్లకు పైగా జీఎస్‌టీ వసూలవుతోంది. రాష్ట్రంలో కీలక రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, వ్యాపార అనుకూల వాతావరణం వల్ల కొత్త పెట్టుబడులు తరలివచ్చి పన్నుల వృద్ధికి కారణమైందని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ ఎం.రఘునందన్‌రావు తెలిపారు. పన్ను చెల్లింపుదారులు స్వచ్ఛందంగా, పారదర్శకంగా పన్నులు చెల్లించడం వల్ల ఖజానాకు భారీగా ఆదాయం సమకూరిందన్నారు. పన్ను చెల్లింపుదారులకు మరింత అనుకూల వాతావరణం కల్పించేందుకు, సమర్థంగా పనిచేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఈ పన్ను వసూళ్లు పెరుగుతూ రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం రాష్ట్రాలవారీగా వసూలైన జీఎ్‌సటీ వివరాలను వెల్లడించింది. తెలంగాణ నుంచి ఈ ఏప్రిల్‌లో రూ.4,621 కోట్ల జీఎస్‌టీ వసూలైనట్లు తెలిపింది. గతేడాది (2025) ఏప్రిల్‌లో ఇది రూ.3,433 కోట్లు వసూలైంది. అంటే గతేడాది కంటే ఈసారి రూ1,188 కోట్లు అధికంగా వసూలైనట్లు తేలింది. ఇది 35 శాతం వృద్ధిగా నమోదైంది. నిజానికి జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన 2017 నుంచి రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో జీఎస్‌టీ ఎప్పుడూ వసూలు కాలేదు. ఈ ఏడాది మార్చిలో రూ.4,231 కోట్లు వసూలు కాగా.. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా రూ.4,621 కోట్లు వసూలైంది. జనవరి నెల నుంచి నాలుగు నెలలుగా రూ.4 వేల కోట్ల మార్కును దాటి వసూలవుతోంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీగా ఊతమిస్తోందని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


మూడు జీఎస్‌టీలు కలిపి రెండో స్థానంలో..

వాస్తవానికి రాష్ట్రంలోని పన్ను చెల్లింపుదారుల నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో మొత్తం రూ.7,181 కోట్లు వసూలయ్యాయి. ఇందులో సెంట్రల్‌ జీఎస్‌టీ రూ.2,092 కోట్లు, స్టేట్‌ జీఎస్‌టీ రూ.2,527 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ.2,562 కోట్లుగా ఉంది. గతేడాది ఏప్రిల్‌లో ఈ మూడింటి కింద వసూలైనదానితో పోల్చితే ఈసారి 12.6 శాతం వృద్ధి నమోదైంది. ఇలా రాష్ట్రాల నుంచి అన్ని రకాల జీఎస్‌టీ వసూళ్లలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 14.5 శాతం వృద్ధితో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. జీఎస్‌టీతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌), వృత్తి పన్ను(పీటీ) వసూళ్లన్నీ కలిపి రికార్డు సృష్టించాయి. గతేడాదితో పోలిస్తే.. ఈసారి 22 శాతం వృద్ధి నమోదైంది. ఇలా జీఎస్‌టీ, వ్యాట్‌, వృత్తి పన్ను అన్నీ కలిపి ఏప్రిల్‌ నెలలో రూ.7,570 కోట్లు వసూలయ్యాయి. గతేడాది ఏప్రిల్‌లో వీటి ద్వారా రూ.6,210 కోట్లు మాత్రమే వసూలైంది. అంటే... గతేడాది కంటే ఈసారి 22 శాతం వృద్ధి నమోదైనట్లు తేలింది.

Updated Date - May 02 , 2026 | 05:43 AM