ఏసీబీ వలలో ఇద్దరు ప్రభుత్వోద్యోగులు
ABN , Publish Date - Aug 21 , 2026 | 06:22 AM
రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ప్రభుత్వోద్యోగులు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
రూ.30 వేల లంచంతో పట్టుబడ్డ రాజంపేట ఎస్‌ఐ
రూ.20 వేల లంచం అడిగిన మొలంగూర్ జీపీవో
కామారెడ్డి/ శంకరపట్నం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ప్రభుత్వోద్యోగులు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో సిమెంట్ వ్యాపారుల మధ్య జరిగిన ఘర్షణ సందర్భంగా నమోదైన కేసులో ఒక వర్గం వ్యాపారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి రాజంపేట ఎస్‌ఐ ఆంజనేయులు రూ.50 వేలు లంచం అడిగి.. రూ.30 వేలకు ఒప్పుకున్నాడు. కానీ, ఆ డబ్బు ఇవ్వలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించిన వ్యాపారి.. వారి సూచన మేరకు గురువారం ఎస్‌ఐకి కామారెడ్డిలోని ఎన్‌జీవోఎ్‌స కాలనీలోని ఆయన ఇంటి వద్దే సదరు వ్యాపారి రూ. 30 వేలు లంచం ఇస్తుండగా.. డీఎస్పీ శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో అక్కడే నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ఆంజనేయులును పట్టుకుని.. నగదు స్వాఽధీనం చేసుకున్నారు. మరో ఘటనలో కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం రాజాపూర్ వాసి తన తండ్రి పేరు మీదున్న ఆస్తిని తన తల్లి, తన పేరు మీద మార్చడానికి గత నెల 21న స్లాట్ బుక్ చేసుకున్నాడు. దీనిపై ఫీల్డ్ ఎంక్వైరీ చేయడానికి మొలంగూర్ గ్రామ పరిపాలనాధికారి (జీపీవో) కంపెటి శ్రీనివాస్‌ను కలిస్తే.. ‘మీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావాలంటే రూ.20 వేలు ఇవ్వాలి’ అన్నాడు. చివరికి రూ.15 వేలకు జీపీవో ఒప్పుకున్నా.. ఏసీబీ అధికారులను కలిసిన బాధితుడు వారి సూచన మేరకు గురువారం తహసీల్దార్ ఆఫీసులో రూ.15 వేలు ఇవ్వగా, మరో రూ.5,000 డిమాండ్ చేశాడు. అలా మొత్తం రూ.20 వేలు తీసుకున్న జీపీవో శ్రీనివా్‌సను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.