Share News

డీసీ వంశీమోహన్‌ పాపాల పుట్ట!

ABN , Publish Date - May 24 , 2026 | 04:43 AM

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ విభాగం డిప్యూటీ కలెక్టర్‌ మర్రి వంశీ మోహన్‌ పాపాల పుట్టను బద్దలుకొట్టిన ఏసీబీ అధికారులు..

డీసీ వంశీమోహన్‌ పాపాల పుట్ట!

  • ఆరా తీస్తున్న ఏసీబీ అధికారులు.. ఆయన వెనుక అప్పటి ప్రభుత్వంలోని కీలక మంత్రి ?

  • పెద్ద తలకాయల పాత్రపై దృష్టి

హైదరాబాద్‌ సిటీ/గచ్చిబౌలి/అబ్దుల్లాపూర్‌మెట్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ విభాగం డిప్యూటీ కలెక్టర్‌ మర్రి వంశీ మోహన్‌ పాపాల పుట్టను బద్దలుకొట్టిన ఏసీబీ అధికారులు.. ఆయన వెనుక ఉన్న అదృశ్య శక్తులపై దృష్టి పెట్టారు. అత్యున్నత స్థాయిలో ఉన్న వారి అండతోనే వంశీమోహన్‌ ఈ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వంశీ మోహన్‌ వెనుక ఎవరున్నారనే దానిపై అధికారులు విచారిస్తున్నారు. ముఖ్యంగా అప్పటి ఓ మంత్రి.. వంశీమోహన్‌ వెనుక ఉన్నారనే ఆరోపణలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అబ్దుల్లాపూర్‌మెట్‌లో 8 ఎకరాలకు సంబంధించి జరిగిన అక్రమాలను గుర్తించిన ఏసీబీ అధికారులు.. అలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయనే దానిపైనా దృష్టి సారించారు.

2019 నుంచి 2023 వరకు శేరిలింగంపల్లి తహసీల్దార్‌గా పని చేసిన సమయంలోనే వంశీ మోహన్‌ అక్రమ సంపాదన మొదలైందని సమాచారం. సచివాలయంలోని ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌ స్థాయి అధికారుల అండదండలతో గతంలో పని చేసిన తహసీల్దార్ల కంటే వంశీమోహన్‌ శేరిలింగంపల్లిలో ఎక్కువ కాలం పని చేశారనే ప్రచారం ఉంది. ఆ సమయంలోనే నాటి ప్రభుత్వ పెద్దలకు, అప్పటి ఓ కీలక మంత్రికి అనుకూలంగా వంశీ మోహన్‌ పని చేశారని చెబుతున్నారు. కలెక్టర్‌, తహసీల్దార్‌, ఆర్‌ఐ, క్లర్క్‌ ఓ ముఠాగా ఏర్పడి భూముల రికార్డులు మార్చడాన్ని పనిగా పెట్టుకున్నారని సమాచారం. వంశీమోహన్‌ ఓ కలెక్టర్‌ సహాయంతో గోపన్‌పల్లి, ఖానామేట్‌, నానక్‌రాంగూడ, కొండాపూర్‌, మాదాపూర్‌, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లోని విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా యూఎల్‌సి భూములకు, అసైన్డ్‌ భూములకు ఎన్‌ఓసీలు ఇచ్చినట్లు తెలిసింది. నల్లగండ్ల పెద్దచెరువు నుంచి కిందకు వెళ్లే వరదనీటి కాల్వను ఓ నిర్మాణ సంస్థకు అనుకూలంగా మార్పులు చేసి కోట్లు దండుకున్నారని సమాచారం. గచ్చిబౌలిలో 10ఎకరాలు కోర్టు వివాదంలో ఉన్నా సరే ఓ రియల్టర్‌ సంస్థకు అనుకూలంగా వ్యవహరించారు. గోపన్‌పల్లిలో ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్‌ భూమికి కూడా క్రయ విక్రయాలకు అనుకూలంగా ఎన్‌ఓసీలు జారీ చేసినట్లు సమాచారం.


కొండాపూర్‌లో సర్వే నెంబర్‌ 59, ఖాజాగూడలో 5/3, 84లోని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారు. అప్పటి ప్రభుత్వంలోని కొందరు రాజకీయ నాయకులు ఐటీ కారిడార్‌ పరిధిలోని ప్రభుత్వం భూములను కాజేసేందుకు చేసిన ప్రయత్నాలకు వంశీ మోహన్‌ పూర్తి స్థాయిలో సహకరించినట్లు తెలుస్తోంది. ఇక, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం పిగ్లీపూర్‌లో వంశీమోహన్‌ తన మామ పేరు మీద వివాదాస్పద సర్వే నంబర్‌లో 8 ఎకరాల భూమిని కోనుగోలు చేసినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు సంబంధిత రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో తనకున్న పలుకుబడితో వంశీమోహన్‌ ఆ భూమిని తన మామ పేరిట రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ భూమితో ఎప్పటికైనా ఇబ్బంది రావచ్చన్న అనుమానంతో ఓ రియల్‌ సంస్థకు బదలాయించినట్లు సమాచారం. అందుకు ప్రతిఫలంగా క్లియర్‌ టైటిల్‌ ఉన్న సమీపంలోని మరో లేఔట్‌లో వంశీమోహన్‌ మామకు 10 ప్లాట్లను రిజిస్ర్టేషన్‌ చేసినట్లు తెలిసింది. వంశీమోహన్‌ బదిలీ అయిన తర్వాత సిరిసిల్ల నుంచి ఓ మంత్రి శ్రీనివా్‌స ను ఆ స్థానంలోకి తీసుకువచ్చారని ప్రచారం ఉంది. వంశీమోహన్‌ దారిలోనే శ్రీనివాస్‌ కూడా గోపన్‌పల్లి, ఖాజాగూడలో అసైన్డ్‌ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన కొన్నిరోజులకేశ్రీనివాస్ను అప్పటి కలెక్టర్‌ ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. దర్యాప్తు జరిపిన ఉన్నతాధికారులు శ్రీనివాస్ ను సస్పెండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో వంశీమోహన్‌ అరెస్టు అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Updated Date - May 24 , 2026 | 04:43 AM