ఏసీబీకి దొరికినా ఏం కాదులే!
ABN , Publish Date - Jun 22 , 2026 | 04:29 AM
అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) గత రెండున్నరే ళ్లుగా అవినీతి ఉద్యోగులపై ఉక్కుపాదం మోపుతూ రికార్డు సృష్టిస్తున్నా.. వారికి శిక్షలు వేయించటంలో మాత్రం వెనుకబడిపోతోంది. కీలకమైన ప్రాసిక్యూషన్....
అవినీతి కేసుల్లో ప్రాసిక్యూషన్ అనుమతికి ఏళ్లకేళ్లు జాప్యం.. ఏసీబీ దూకుడు ప్రదర్శించినా ఫలితం శూన్యం
ప్రాసిక్యూషన్‌కు మోకాలడ్డుతున్న ఉన్నతాధికారులు
25 శాతం కేసుల్లోనే అనుమతులు.. మిగతావ న్నీ పెండింగ్‌లోనే
రెవెన్యూ శాఖలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 400 ఫైళ్లు పెండింగ్
ఏసీబీకి దొరికిన ఉద్యోగులు మళ్లీ ఉద్యోగంలో చేరి వసూళ్ల దందా
హైదరాబాద్, జూన్ 21(ఆంధ్రజ్యోతి): అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) గత రెండున్నరే ళ్లుగా అవినీతి ఉద్యోగులపై ఉక్కుపాదం మోపుతూ రికార్డు సృష్టిస్తున్నా.. వారికి శిక్షలు వేయించటంలో మాత్రం వెనుకబడిపోతోంది. కీలకమైన ప్రాసిక్యూషన్ అనుమతుల విషయంలో ఏసీబీ దూకుడుకు కొన్నిశాఖల ఉన్నతాధికారులు మోకాలడ్డుతున్నారు. 2021 నుంచి ఇప్పటి వరకు ఐదున్నరేళ్లలో ఏసీబీ 724 కేసులు నమోదు చేసింది. గత రెండున్నరేళ్లలోనే నమోదైన కేసుల సంఖ్య 441. 2021 నుంచి 2023 వరకు 283 కేసులు నమోదు చేయగా.. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఏసీబీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో దూకుడు పెంచింది. ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేసిన తర్వాత ఆ ప్రభుత్వ అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖకు రాతపూర్వకంగా సిఫారసు చేస్తారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను ఆయా శాఖల ఉన్నతాధికారులు తొలుత సస్పెన్షన్‌లో పెడతారు. తర్వాత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడానికి ఏసీబీకి ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడే అంతులేని జాప్యం జరుగుతోంది. ప్రాసిక్యూషన్ అనుమతులు యూనిఫాం సర్వీసుకు చెందిన విభాగాలనుంచే వేగంగా వస్తున్నాయని సమాచారం. రెవెన్యూ విభాగం నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి కోరిన ఫైళ్లు ఐదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని ఏసీబీ అధికారులు పేర్కొంటున్నారు. 25 శాతం కేసులకు మాత్రమే ప్రాసిక్యూషన్ అనుమతులు లభించాయని తెలుస్తోంది. రెవెన్యూ విభాగానికి సంబంధించి 400కి పైగా కేసులు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి కోసం పెండింగ్‌లో ఉండటం గమనార్హం. దీంతో ఏసీబీ కేసుల్లో పట్టుబడిన రెవెన్యూ ఉద్యోగులు సస్పెన్షన్ గడువు పూర్తయిన తర్వాత విధుల్లో చేరి కీలక పోస్టులు దక్కించుకొని మళ్లీ అవినీతి కేసుల్లో పట్టుబడిన ఘటనలు వెలుగుచూశాయి. 2014 నాటికి రెవెన్యూ శాఖలో 101 ఏసీబీ కేసులు ప్రాసిక్యూషన్ అనుమతి కోసం పెండింగ్‌లో ఉండగా, 2014 నుంచి 2021 వరకు వీటికి అదనంగా మరో 222 కేసులు చేరాయి. వీటిలో ఐదారుకేసుల్లో మాత్రమే ప్రాసిక్యూషన్‌ను ఏసీబీ చేపట్టగలిగింది. 2021 నుంచి నమోదైన 80 శాతం కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసినా 25 శాతం కేసుల్లో మాత్రమే చార్జిషీట్లు దాఖలు చేయగలిగింది. అవినీతి కేసుల్లో దొరికినా వెంటనే శిక్షలు పడకపోవటంతో ఉద్యోగులు మరింత తెగించి అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఏసీబీ అధికారులు అంటున్నారు.