Share News

నరహరికి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌

ABN , Publish Date - Jun 18 , 2026 | 06:39 AM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేసిన ల్యాండ్‌ అండ్‌ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ సుంకరి నరహరిరావుకు న్యాయమూర్తి బుధవారం 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు.

నరహరికి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేసిన ల్యాండ్‌ అండ్‌ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ సుంకరి నరహరిరావుకు న్యాయమూర్తి బుధవారం 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. దీంతో ఆయనను ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. నరహరి ఇంటితో పాటు పదిచోట్ల ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించి భారీగా నగదు, రూ.100 కోట్లకు పైగా అక్రమార్జనను గుర్తించిన సంగతి తెలిసిందే. కాగా, కేసు దర్యాప్తు సమయంలో ఏసీబీ అధికారులను నరహరి ముప్పుతిప్పలు పెట్టినట్లు తెలుస్తోంది. నరహరి భార్య పేరిట రెండు బ్యాంకు లాకర్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. వాటి తాళం చెవులు ఇవ్వమని పలుమార్లు అడిగినా, కనిపించడం లేదని కొంతసేపు, అవెక్కడ పెట్టానో గుర్తుకు రావడం లేదని మరికొంతసేపు నరహరి ఆ విషయాన్ని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నించినట్లు సమాచారం. దీంతో ఆ లాకర్లను ఫ్రీజ్‌ చేయాలని ఆయా బ్యాంకుల అధికారులకు ఏసీబీ లేఖలు రాసింది. ఈ లాకర్లలో మరో రూ.2 కోట్ల నగదు ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. నరహరి తాను సంపాదించిన అక్రమార్జనను చాలావరకు ఇళ్లు, ఫ్లాట్లు, ఇంటి స్థలాల రూపంలోకి మార్చుకున్నప్పటికీ ఇంకా వస్తున్న నగదును ఏ ప్రభుత్వ ఉద్యోగీ చేయని విధంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేయడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. రూ.5.05 కోట్ల మొత్తాన్ని నరహరి తన కుటుంబసభ్యుల పేరిట బ్యాంకుల్లో ఎఫ్‌డీ చేసిన సంగతి తెలిసిందే . నరహరి అక్రమార్జనకు సంబంధించి ఆయనను నిశితంగా విచారించాల్సిన నేపథ్యంలో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మరోవైపు ఈడీ, ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా ఏసీబీ నుంచి వివరాలు కోరినట్లు తెలుస్తోంది.

Updated Date - Jun 18 , 2026 | 06:40 AM