ఏసీబీ వలలో ఎక్సైజ్ చేప
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:56 AM
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్
ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు
ఐదు ఇళ్లు, 8 ఇళ్ల స్థలాలు, 10ఎకరాల భూమి గుర్తింపు
ఆయన బ్యాంకు బాలెన్స్ రూ.50లక్షలు
హైదరాబాద్, నిజామాబాద్, మద్దూరు, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో... మచ్చబొల్లారంలోని మల్లారెడ్డి నివాసంలో, ఆయన బంధువులు, కుటుంబసభ్యులకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో 11 చోట్ల ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా తనిఖీలు చేశారు. ఆయన భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు వారు ఈ సోదాల ద్వారా గుర్తించారు. ఒక వాణిజ్యభవనం, నాలుగు ఇళ్లు, 8 ఇళ్ల స్ధలాలు, 10.23 ఎకరాల వ్యవసాయ భూమి.. మల్లారెడ్డి. ఆయన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్నట్లు వెల్లడైంది. మల్లారెడ్డి ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.3.31 లక్షల నగదు, మూడు బ్యాంకు లాకర్ల వివరాలు లభ్యమయ్యాయని.. ఆయన బ్యాంకు ఖాతాలో రూ.50 లక్షల బ్యాలెన్స్ ఉన్నట్టు గుర్తించామని, బ్యాంకు లాకర్లు ఆయన భార్య పేరిట ఉన్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. నిజామాబాద్‌లోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన తర్వాత మల్లారెడ్డిని అక్కడి నుంచి మచ్చబొల్లారంలోని ఇంటికి ఏసీబీ అధికారులు తీసుకొచ్చారు. ఆరేళ్లుగా నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా ఉన్న మల్లారెడ్డి.. ఒక రిటైర్డ్ హెడ్‌కానిస్టేబుల్ ద్వారా తన కార్యాలయంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఆయన అక్రమార్జనపై పలు ఫిర్యాదులు వస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు ఇటీవలే ఆయనపై ప్రాథమిక విచారణ జరిపి.. సోమవారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మంగళవారం సోదాలు నిర్వహించారు. మల్లారెడ్డిని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్ధానంలో హజరుపరచనున్నామని, ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని, లాకర్లు తెరవాల్సి ఉందని ఏసీబీ డీజీ చారుసిన్హా ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆయన ఆస్తుల విలువ రిజిస్ట్రేషన్ ధరల ప్రకారం రూ.3 కోట్లు అని, వాస్తవ ధర ఇంతకన్నా ఏన్నో రెట్లు అధికంగా ఉంటుందని ఆమె వివరించారు.