Share News

త్వరలో మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన

ABN , Publish Date - Apr 19 , 2026 | 06:14 AM

రాష్ట్రంలోని వరంగల్‌, ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రతిపాదించిన విమానాశ్రయాల నిర్మాణాలకు ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

త్వరలో మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన

  • ఆదిలాబాద్‌ విమానాశ్రయ మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలి

  • భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై నివేదిక రూపొందించాలి

  • 3 విమానాశ్రయాల నిర్మాణాలపై సమీక్ష సందర్భంగా అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వరంగల్‌, ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రతిపాదించిన విమానాశ్రయాల నిర్మాణాలకు ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణాలను వీలైనంత తొందరగా ప్రారంభించేందుకు అవసరమైన భూసేకరణ, సాంకేతిక అనుమతులు, మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. మూడు విమానాశ్రయాల నిర్మాణాలపై శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సదరన్‌ రీజియన్‌ ఈడీ రాజ్‌కిషోర్‌, ఏవియేషన్‌ డైరెక్టర్‌ భరత్‌రెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విమానాశ్రయాల ఏర్పాటుపై కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ పనులను త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. వరంగల్‌ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టు కోసం ఇప్పటికే 953 ఎకరాల భూమిని సేకరించి కేంద్రానికి అప్పగించామని, ఈ ప్రాజెక్టుకు వీలైనంత త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. ఆదిలాబాద్‌ విమానాశ్రయాన్ని రక్షణ శాఖ, సివిల్‌ ఏవియేషన్‌, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, ఇందుకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌ను తక్షణమే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. భూ సేకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతంలో ఎయిర్‌పోర్టుకు కేటాయించిన స్థలం నిర్మాణానికి అనువుగాలేదని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపిన నేపథ్యంలో దీనిపై లోతుగా అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Apr 19 , 2026 | 06:15 AM