పాత జాబితాతో ముందుకు?
ABN , Publish Date - Aug 20 , 2026 | 05:25 AM
భూములు, ఆస్తుల నిషేధిత జాబితా (22ఏ) చిక్కుల నుంచి బయటపడేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ప్రైవేటు ఆస్తులు పెద్ద ఎత్తున 22ఏ జాబితాలో
2023కు ముందునాటి 22ఏ జాబితాకే పరిమితం?
ప్రస్తుత వివాదం నుంచి బయటపడేందుకు
అన్ని అవకాశాలను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వ ఉత్తర్వులు, క్రమబద్ధీకరణ జీవోలను పట్టించుకోకుండా కొత్త నిషేధిత జాబితా
రెవెన్యూ అధికారుల తీరుతో సర్కారుకు తలనొప్పి
సామాన్యులను ఇబ్బందిపెడుతున్నారనే విమర్శలు
దీంతో పాత జాబితానే తిరిగి అమల్లోకి తెస్తే సమస్య తొలగిపోతుందనే యోచన
2023 డిసెంబరుకు ముందు జాబితాలోని
భూములు, ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయకుండా చర్యలు
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): భూములు, ఆస్తుల నిషేధిత జాబితా (22ఏ) చిక్కుల నుంచి బయటపడేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ప్రైవేటు ఆస్తులు పెద్ద ఎత్తున 22ఏ జాబితాలో పెట్టారంటూ ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఏం చేస్తే బాగుంటుందనే చర్చలు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ వర్గాల్లో జరుగుతున్నాయి. గత కొన్నేళ్లలో ప్రభుత్వం జారీ చేసిన పలు ఉత్తర్వులు, క్రమబద్ధీకరణ జీవోలను పట్టించుకోకుండా 2025 డిసెంబరులో కొత్త జాబితాను రూపొందించడంతోనే ఈ సమస్య తలెత్తిందనే భావన వ్యక్తమైనట్టు తెలిసింది. ఈ క్రమంలో కొత్త జాబితాను పక్కనపెట్టి.. 2023 డిసెంబరుకు ముందు నాటి జాబితాకే పరిమితమైతే ఎలా ఉంటుందన్న దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
భారీగా ప్రైవేటు ఆస్తులను 22ఏలో చేర్చడంతో..
దేవాదాయ, వక్ఫ్ భూములు, సీలింగ్‌భూములు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయోజనాలు, స్థానిక సంస్థలు, విద్యా, ప్రార్థనా మందిరాలు, సాంస్కృతిక, మత సంస్థల, చారిటబుల్ సంస్థల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూములు, కోర్టు అటాచ్‌మెంట్, పన్నుల ఎగవేతఅటాచ్‌మెంట్ ఉన్న భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చుతారు. ఆ భూములు/ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా, అక్రమాలు జరగకుండా ఉండాలన్నదే దీని ఉద్దేశం. 2007 వరకు నిషేధిత జాబితా అనే పదమే పెద్దగా వినిపించేది కాదు. అప్పట్లో ప్రభుత్వ భూములు 13.82 లక్షల ఎకరాలు, ప్రభుత్వ ఖాళీ భూములు 7.21 లక్షల ఎకరాలు, అటవీ భూములు 41.74 లక్షల ఎకరాలు, దేవాదాయ శాఖ భూముల కింద 74,128 ఎకరాలు, వక్ఫ్ భూములు 45,564 ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో కనిపించేవి. తర్వాత నిషేధిత జాబితా పెరుగుతూ వస్తోంది. 2007- 2017 మధ్య మొత్తం భూముల్లో 10శాతం వరకు జాబితాలో ఉండగా.. ఇప్పుడు 30-40 శాతం వరకు చేరాయనే విమర్శలు ఉన్నాయి. 2025 డిసెంబరులో సిద్ధం చేసిన 22ఏ జాబితాలో పెద్ద సంఖ్యలో ప్రైవేటు ఆస్తులు నిషేధిత జాబితాలో చేర్చారు. రైతుల సాగులో ఉన్న భూములు, ఓఆర్‌ఆర్ లోపల అపార్ట్‌మెంట్లు, ఓపెన్ ప్లాట్లను కూడా నిషేధిత జాబితాలో పెట్టడం వివాదాస్పదంగా మారింది. సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 22ఏ జాబితాలోని ప్రైవేటు ఆస్తులను పక్కా ఆధారాలు ఉంటే రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ధరణి కమిటీ కోరినా.. జాబితా ఇవ్వని సీసీఎల్‌ఏ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్‌ను సంస్కరించే క్రమంలో ధరణి కమిటీని ఏర్పాటు చేసింది. అసలు రాష్ట్రంలో ఏయే కేటగిరీ కింద ఎన్ని ఎకరాల నిషేధిత భూములు ఉన్నాయో వివరాలు ఇవ్వాలని సీసీఎల్‌ఏను కోరింది. కానీ సీసీఎల్‌ఏ నుంచి కమిటీకి ఎలాంటి వివరాలు అందలేదు. భూచట్టాలు, భూసమస్యలకు సంబంధించి అన్ని రకాల సమాచారం ఇచ్చిన ప్రభుత్వం.. నిషేధిత భూముల వివరాలను మాత్రం ఇవ్వలేదని కమిటీలో సభ్యుడుగా ఉన్న భూచట్టాల నిపుణుడు సునీల్ గతంలో ఆంధ్రజ్యోతికి వివరించారు.
నిఘా ఉంది.. చర్యలు తప్పవు..
‘‘రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గత మూడు రోజుల నుంచి 22ఏ జాబితాలోని ప్రైవేటు ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిశితంగా పరిశీలిస్తున్నాం. ప్రభుత్వం అనుమతించింది కదా అని.. 2025 డిసెంబరు కంటే ముందునాటి నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు అనుమతించినా, చట్టపరమైన ఉల్లంఘనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవు. రోజువారీగా రిజిస్ట్రేషన్లలో డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నాం. సర్వే నంబర్ల మీద ఉన్న వివాదాలు, గతంలో ఎప్పటి నుంచి 22ఏలో ఉంది, కోర్టు ఉత్తర్వులు, ఇతరత్రా వివాదాలేమైనా ఉన్నాయా గమనించాలి. అలాంటి ఆస్తులపై రెవెన్యూ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తే ఉపేక్షించేది లేదు’’
- రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు