Share News

సామాన్యుల భూములపై 22ఏ కత్తి

ABN , Publish Date - Aug 06 , 2026 | 05:39 AM

రిజిస్ట్రేషన్ల చట్టంలోని అత్యంత కఠినమైన 22ఏ సెక్షన్‌.. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

సామాన్యుల భూములపై 22ఏ కత్తి

  • నిత్యం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వందలాది మంది

  • ‘నో అబ్జెక్షన్‌’ సర్టిఫికెట్‌ ఇస్తేనే రిజిస్ట్రేషన్‌ చేస్తామంటున్న అధికారులు

  • దిక్కుతోచక లబోదిబోమంటున్న కొనుగోలు, అమ్మకం దారులు

  • నారపల్లి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం వద్ద బాధితుల నిరసన

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్ల చట్టంలోని అత్యంత కఠినమైన 22ఏ సెక్షన్‌.. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్‌, సీలింగ్‌ భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న భూములనేకాక.. ప్రైవేటు స్థలాలనూ ఈ జాబితాలో చేర్చడం ఇందుకు కారణం. హైదరాబాద్‌ మహానగరంలో తమకు సొంత ఇల్లు లేదా అపార్ట్‌మెంట్‌, స్థలం ఉండాలనే ఆశతో పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న ఆస్తులపై ‘22ఏ కత్తి’ వేలాడుతుండడంతో వారు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. రకరకాల కష్టాలతో.. అర్జెంటుగా డబ్బు అవసరమై ఆయా స్థలాలు, ఇళ్లు, ఫ్లాట్లను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నవారికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఆ ఆస్తిని అమ్ముకునే అవకాశంలేదని తెలిసి వాపోతున్నారు ‘‘అది మీదేనని నిరూపించుకోవాలంటే కలెక్టరేట్‌లోని అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ (యూఎల్‌సీ)లో.. లేదా తహసీల్దార్‌ ఆఫీసుల నుంచి ఎన్‌వోసీ తప్పకుండా తీసుకురావాలి’’ అని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు సూచిస్తుండడంతో హడలిపోతున్నారు. వాస్తవంగా 22ఏ, బీ, సీ, డీ, ఈ కింద ఉన్న భూములన్నీ ప్రభుత్వానికి సంబంధించినవిగా ఉంటాయి. ఇందులో అసైన్డ్‌, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన భూములు, ఎండోమెంట్‌/వక్ఫ్‌, అగ్రికల్చర్‌ సీలింగ్‌, అర్బన్‌ సీలింగ్‌, కోర్టు కేసులకు సంబంధించిన భూములుంటాయి.


వీటిపై రెవెన్యూ అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ప్రధానంగా తహసీల్దార్లకు, సర్వేయర్లకు తమ పరిధిలో అసైన్డ్‌, ఎండోమెంట్‌ తదితర ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి.. వాటి నక్ష, మ్యాపులు ఏమిటీ, అవన్నీ ల్యాండ్‌ బ్యాంకులో ఉన్నాయా.. అనే వాటిపై అవగాహన ఉండాలి. అలాగే ప్రభుత్వ భూముల పక్కన ఉన్న ప్రైవేట్‌ పట్టా భూములేమిటీ.. అందులో ఏమైనా నిషేధిత జాబితాలో కలుస్తున్నాయా.. తెలుసుకుని ప్రభుత్వానికి సమగ్రమైన సమాచారం అందించాలి. అయితే కొన్నినెలల క్రితం చేసిన భూ రికార్డుల సవరణలో కొంతమంది అధికారులు క్షేత్రస్థాయిలో చేసిన సర్వేలో ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు తెలిసింది. ఉదాహరణకు ఘట్‌కేసర్‌ మండలంలోని నారపల్లిలో 121.30 ఎకరాలు ఎండోమెంట్‌ కింద ఉంది. అయితే 1982లో 2063 జీవో ద్వారా అందులో సుమారు 111 ఎకరాలను ప్రభుత్వం లేఅవుట్‌ చేసి కొంతమందికి విక్రయించింది. పలు సర్వే నంబర్లలో ఉన్న మిగతా 10 ఎకరాలు దేవుడి మాన్యం కింద ఉంచారు. కానీ.. ఇటీవల ఆ మొత్తం 121.30 ఎకరాలను 22ఏ/సీ కింద చూపిస్తూ తాజా క్రయవిక్రయాలను నిలిపివేశారు. దీంతో అక్కడ భూములు కొనుగోలు చేసిన వారు, ఇళ్లను కట్టుకున్న వారు.. తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సుమారు 46 ఏళ్ల క్రితం స్పెషల్‌ జీవోతో ఆ భూములను అమ్మి, కొన్నవారి నుంచి పన్నులు కూడా కట్టించుకుంటున్న సర్కారే.. ఇప్పుడు వాటిని 22ఏ సెక్షన్‌లో పెట్టి సతాయించడం ఎంతవరకూ సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. అక్కడొక్కచోటే కాదు.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో దాదాపు 4 లక్షల ఎకరాల భూములు ఇలా 22ఏలో పెట్టినట్లు సమాచారం.


సర్కారుకు చెడ్డపేరు..

రాష్ట్రంలో ప్రభుత్వ భూముల లెక్కతేల్చి వాటిని కబ్జాదారుల నుంచి పరిరక్షించాలనే మంచి ఉద్దేశంతో చేపట్టిన భూ రికార్డుల సవరణలో కొంతమంది రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలు, అసమగ్ర సర్వేలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఈ సవరణలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిశీలించిందా.. లేకుంటే అధికారులు ఏది ఇస్తే దానిని అమలులోకి తీసుకొచ్చిందా.. అనేది తెలియని పరిస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమగ్ర పరిశీలన చేసి అసైన్డ్‌, ఎండోమెంట్‌, వక్ఫ్‌బోర్డుల పక్కన ఉన్న ప్రైవేట్‌, లేఅవుట్‌ భూముల క్రయవిక్రయాలు సజావుగా జరిగేందుకు బై నంబర్లతో అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల సమస్య ఇలా ఉండగా.. దీనివల్ల రిజిస్ట్రేషన్‌శాఖ ఆదాయం కూడా భారీగా పడిపోతోంది. 3 నెలల క్రితం నారపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీ్‌సలో రోజుకు సగటున 100 రిజిస్ట్రేషన్లు జరిగేవని.. కానీ, నెలరోజులుగా 40-50 మాత్రమే అవుతున్నాయని ఒక అధికారి తెలిపారు.

బలిపీఠంపై ప్రజలు..

ప్రైవేటు భూములను 22ఏ జాబితాలో పెట్టడాన్ని నిరసిస్తూ బుధవారం నారపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు ఎదుట తెలంగాణ రియల్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బాధితులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేట్‌ ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టడం ద్వారా రాష్ట్ర సర్కారు పేద, మధ్య తరగతి ప్రజలను బలిపీఠంపై నిలబెట్టిందని అసోసియేషన్‌ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్‌ మండిపడ్డారు. ఎన్నో ఏళ్ల్ల క్రితం కొనుగోలు చేసిన భూములు, ఇళ్లను.. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్యచికిత్స కోసం కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా చేస్తోందంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తప్పుడు సర్వే చేసిన అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని నిలదీశారు. మూడున్నర నెలలుగా ఈ సమస్యను ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. పాలకులు నిద్రపోతుండడంతో రెవెన్యూ ఉద్యోగులు ప్రైవేట్‌ ఆస్తులపై పడి దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రైవేట్‌ పట్టా భూములను వెంటనే నిషేధిత జాబితాలో నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.


ఈయన పేరు డీఎం సుబ్బారావు. ఒక ప్రైవేట్‌ కంపెనీలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. 3 నెలల క్రితం పీర్జాదిగూడలో సెకండ్‌ సేల్‌ కింద ఓ అపార్ట్‌మెంట్‌లో 1115 చదరపుటడుగుల ఫ్లాట్‌ను రూ.31 లక్షలకు కొనుగోలు చేశాడు. అడ్వాన్స్‌ కింద రూ.5 లక్షలు విక్రయదారుకుచెల్లించారు. మిగతా రూ.26 లక్షలు బ్యాంకులో లోన్‌ తీసుకున్నాడు. రెండు నెలల క్రితమే బ్యాంకు రుణం కూడా మంజూరైంది. నెలకు రూ.25వేలు ఈఎంఐ కింద చెల్లిస్తున్నారు కూడా. కానీ.. ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ మాత్రం అవ్వట్లేదు. ఎందుకు కావడం లేదని ఆ ఫ్లాట్‌ను అమ్మిన వ్యక్తిని అడిగితే.. ఆ అపార్ట్‌మెంట్‌ స్థలం 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉందని అధికారులు చెబుతున్నారని, తహసీల్దార్‌ ఆఫీస్‌ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) వచ్చిన తర్వాతే ఆ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పాడు. ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం తాను రోజూ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ చుట్టూ తిరుగుతున్నానని, ఇది ఎప్పుడు అవుతుందో తెలియడం లేదని ఈయన వాపోతున్నారు.

Untitled-5 copy.jpg


ఉప్పల్‌ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలోని స్వరూ్‌పనగర్‌కు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి సురేశ్‌ 2012లో రూ.25 లక్షలతో 150 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి చిన్నఇల్లు కట్టుకున్నారు. రెండు నెలల క్రితం ఆ ఇంటిని ఒక వ్యక్తికి విక్రయించి కొంత అడ్వాన్స్‌ తీసుకున్నారు. కొన్న వ్యక్తి నెల క్రితం చలానా కట్టి, స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్నా.. రిజిస్ట్రేషన్‌ కాలేదు. కారణమేంటని అడిగితే.. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూమి నిషేధిత జాబితాలో ఉందని అధికారులు చెప్పారు. దీంతో ఆయన తనకు ఆ ఇంటిని అమ్మిన సురేశ్‌ వద్దకు వెళ్లి విషయం చెప్పారు. తాను స్థలం కొనుగోలు చేసిన సమయంలో అన్ని సక్రమంగా ఉన్నాయని చెప్పి రిజిస్ట్రేషన్‌ చేసిన అధికారులు.. ఇప్పుడు తిరకాసు పెట్టడమేమిటని సురేశ్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌వోసీ కోసం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు.

Untitled-5 copy.jpg

Updated Date - Aug 06 , 2026 | 05:43 AM