Share News

22ఏ దరఖాస్తులపై విచారణ చేసి న్యాయం చేయండి

ABN , Publish Date - Aug 06 , 2026 | 05:49 AM

కొత్తగా ఒక్క సెంటు భూమిని కూడా నిషేధిత జాబితాలో పెట్టలేదని.. ‘22ఏ’ పేరుతో ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

22ఏ దరఖాస్తులపై విచారణ చేసి న్యాయం చేయండి

  • దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించండి

  • కలెక్టర్లకు పొంగులేటి ఆదేశం

హైదరాబాద్‌, ఆగస్టు 5( ఆంధ్రజ్యోతి): కొత్తగా ఒక్క సెంటు భూమిని కూడా నిషేధిత జాబితాలో పెట్టలేదని.. ‘22ఏ’ పేరుతో ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సమస్యపై వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోపల పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఓఆర్‌ఆర్‌ లోపల 22ఏ వివాదం, నిషేధిత జాబితాపై సచివాలయంలో బుధవారం ఆయన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అర్హులకు న్యాయం చేయడం, అదే సమయంలో ప్రభుత్వ భూములను కాపాడటం అధికారుల బాఽధ్యత అని స్పష్టం చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను పరిశీలించి నిబంధనల మేరకు అర్హత ఉన్న భూములను గుర్తించి, ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తహశీల్దార్‌, ఆర్డీవో, సబ్‌కలెక్టర్‌, కలెక్టర్‌ స్థాయిలో వచ్చే ప్రతి దరఖాస్తునూ సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేయాలని చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, వెంటనే విచారణ పూర్తి చేసి విధిగా పరిష్కరించాలని ఆదేశించారు. 22ఏ భూములకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి హైకోర్టు నిర్ధేశించిన 45 రోజుల గడువులోనే అన్ని ప్రక్రియలూ పూర్తి చేసి తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

Updated Date - Aug 06 , 2026 | 05:51 AM