Share News

22ఏ సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం

ABN , Publish Date - Aug 20 , 2026 | 05:30 AM

నిషేధిత జాబితా ‘22ఏ’ ఉన్న భూములకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు ప్రభుత్వం ఫాస్ట్‌ ట్రాక్‌ విధానంలో చర్యలు చేపట్టిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

22ఏ సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం

  • ప్రైవేటు ఆస్తుల దరఖాస్తుదార్లకు వెంటనే రిజిస్ట్రేషన్‌

  • ప్రతి కేసును వేగంగా పరిష్కరించే దిశగా చర్యలు

  • మంత్రి పొంగులేటి ఆదేశం

  • ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక కాల్‌ సెంటర్‌

  • 22ఏలో ఉన్న ప్రైవేటు ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్‌సిగ్నల్‌

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): నిషేధిత జాబితా ‘22ఏ’ ఉన్న భూములకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు ప్రభుత్వం ఫాస్ట్‌ ట్రాక్‌ విధానంలో చర్యలు చేపట్టిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 22ఏ జాబితాలో భూమి ఉందనే కారణంతో రిజిస్ట్రేషన్‌ దరఖాస్తులను తిరస్కరించవద్దని.. ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం పర్యటనలో ఉన్న మంత్రి బుధవారం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్‌, రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు, రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌, సంగారెడ్డి కలెక్టర్లతో సమీక్షించారు. చట్టపరంగా ఇబ్బంది లేని దరఖాస్తులను రిజిస్ట్రేషన్‌ చేయాలని.. ఒకవేళ తిరస్కరిస్తే కారణాలు చెప్పాలని మంత్రి పొంగులేటి సూచించారు. తిరస్కరిస్తే ముందుగా కట్టిన రిజిస్ట్రేషన్‌ ఫీజును వెంటనే తిరిగి చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 22ఏ భూముల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

హౌసింగ్‌ బోర్డు కార్యాలయంలో కాల్‌ సెంటర్‌

22ఏ వివాదంపై వచ్చే వినతులు, ఫిర్యాదులను స్వీకరించేందుకు హౌసింగ్‌ బోర్డు కార్యాలయంలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. డీఐజీ సుభాషిణి నేతృత్వంలో ఈ కాల్‌ సెంటర్‌కు వచ్చే ఫిర్యాదులను రికార్డు చేస్తున్నారు. ఫిర్యాదులను, వినతులను సంబంధిత కలెక్టర్లకు పంపి.. చట్టపరంగా ఇబ్బంది లేని భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ వెంటనే పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు. అయితే చాలా మంది బాధితులు జిల్లా కలెక్టరేట్లలో ఈ తరహా వ్యవస్థ అందుబాటులో ఉంటే.. నేరుగా వెళ్లి సమస్య చెప్పుకొనే వీలుంటుందని పేర్కొంటున్నారు.


రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.. సంతోషం..

నిషేధిత జాబితా తమ ఆస్తులు ఉండి, బుధవారం రిజిస్ట్రేషన్‌కు వచ్చిన దరఖాస్తుదారుల నుంచి రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు అభిప్రాయ సేకరణ చేశారు. ఈ సందర్భంగా ఆస్తుల కొనుగోలు/విక్రయదారులు సంతోషం వ్యక్తం చేశారు. ‘‘మూసాపేటలో ఉన్న వైష్ణవి ఎస్టేట్‌కు సంబంధించి సర్వే నంబరు 108లో ఉన్న భూమి విక్రయించాలనుకున్నాం. ఆ భూమికి 2005లోనే సీలింగ్‌ అనుమతి వచ్చింది. కానీ రెండు వారాల కింద రిజిస్ట్రేషన్‌ కోసం వెళితే 22ఏ జాబితాలో ఉందంటూ అధికారులు తిరస్కరించారు. తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు చట్టపరంగా ఏ ఇబ్బందీ లేదని అధికారులు గుర్తించి రిజిస్ట్రేషన్‌ పూర్తిచేశారు’’ అని వైష్ణవి ఎస్టేట్‌ ప్రతినిధి శ్రీనివాస్‌ తేలప్రోల్‌ వెల్లడించారు. ఇక కూకట్‌పల్లి అడ్డగుట్ట సొసైటీలో సర్వే నంబరు 80లో 250 గజాల స్థలాన్ని నెల రోజుల క్రితం కొనుగోలు చేశానని.. రిజిస్ట్రేషన్‌ కోసం వెళితే 22ఏలో ఉందని తిరస్కరించారని సొసైటీ సభ్యుడు చక్రపాణి తెలిపారు. మంగళవారం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి ఫోన్‌ చేసి.. బుధవారం రిజిస్ట్రేషన్‌కు రావాలని చెప్పారని, తనతోపాటు సొసైటీలో ఉన్న 300 ప్లాట్లకు 22ఏ నుంచి విముక్తి కలిగిందని చెప్పారు.

22ఏ నుంచి పలు సర్వే నంబర్ల తొలగించాం

‘‘బాలానగర్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ పరిధిలో గల సర్వే నంబరు 101/1, 101/2, 102, 108, 109, 112, 81లో ఉన్న సుమారు 3000 చదరపు మీటర్ల భూమి 22ఏ జాబితాలో ఉండేది. ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేకుండా రిజిస్ట్రేషన్లు అనుమతిస్తున్నాం. సంబంధిత వ్యక్తులు లావాదేవీలు చేసుకునేందుకు అభ్యంతరం లేదు.’’

-బాలానగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌

Updated Date - Aug 20 , 2026 | 05:31 AM