22ఏ ఫిర్యాదుల్ని 40 రోజుల్లో పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 07 , 2026 | 05:33 AM
నిషేధిత భూముల జాబితా 22ఏ మీద నెలకొన్న వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. 40 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.
స్పెషల్ డ్రైవ్‌కు రెవెన్యూ కార్యదర్శి ఆదేశం
గ్రీవెన్స్ దరఖాస్తులు బయటకు.. నిషేధిత
భూములపై 24 వేలకు పైగా ఫిర్యాదులు
సర్వే నంబర్ల వారీగా పునఃపరిశీలిస్తున్న కలెక్టర్లు
హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): నిషేధిత భూముల జాబితా 22ఏ మీద నెలకొన్న వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. 40 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, వచ్చిన దరఖాస్తులను వీలైనంత మేర పరిష్కరించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ చెప్పారు. దాంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు వారి పరిధిలో వచ్చిన దరఖాస్తులను బయటకు తీశారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ సమస్య జటిలంగా మారింది. గతంలో కంటే నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూముల శాతం తగ్గినా అశాస్ర్తీయంగా అధికారులు తీసుకున్న నిర్ణయాల ఫలితమే ప్రస్తుత వివాదానికి కారణమనే అభిప్రాయం ఉన్నతాధికారుల్లో వ్యక్తమవుతోంది. ఒక సర్వే నంబరులో ఉన్న కొంత భూమి మీద కోర్టు వివాదాలు ఉన్నప్పుడు ఆ భూమి వరకే నిషేధిత జాబితాలో నమోదు చేయాల్సి ఉంది. అధికారులు ఆ సర్వే నంబరులో ఉన్న మొత్తం భూమిని 22ఏలో పెట్టారు. దాంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో రెవెన్యూ యంత్రాంగంలో కదలిక వచ్చింది. గురువారం 33 జిల్లాల కలెక్టర్లు గ్రీవెన్స్‌లో వచ్చిన దరఖాస్తుల వివరాలను సీసీఎల్‌ఏకి పంపారు. మల్కాజ్‌గిరి జిల్లాలో 124 దరఖాస్తులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో 1500 పైగా దరఖాస్తులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 24,813 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
అత్యధికంగా తహశీల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్ల లాగిన్‌లోనే పెండింగ్‌లో ఉన్నాయి. కలెక్టర్ల లాగిన్లలో 9 వేల దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కోర్టు వివాదాలు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ వివాదాలు, వక్ఫ్‌బోర్డు, దేవాదాయ శాఖ, అటవీ శాఖ వివాదాలతో ముడిపడినవే అధికంగా ఉన్నాయి. కోర్ పరిధిలో ప్రభుత్వం లేఅవుట్లు వేసి విక్రయించిన ప్లాట్లలోనూ ఒకే సర్వే నంబరులో కొంత భూమిపై అర్బన్ ల్యాండ్ సీలింగ్ వివాదం ఉంటే గతంలో విక్రయించిన భూములను కూడా 22ఏలో పెట్టేశారు. ఏఎస్ రావు నగర్‌లో ఓ వ్యక్తి 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వ వేలంపాటలో స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకుంటే ప్రస్తుతం అది 22ఏ జాబితాలో ఉందని విక్రయానికి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఒప్పుకోవడం లేదు. దీంతో ఇంటి యజమాని గత రెండు నెలల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తన వద్ద చట్టబద్ధంగా కొనుగోలు చేసిన పత్రాలు అన్నీ చూపినా రిజిస్ట్రేషన్ చేయలేమని చెబుతున్నారని బాధితుడు వాపోతున్నారు. రాజీవ్‌నగర్, కల్యాణ్ నగర్, మోతీ నగర్ పరిధిలో ఈ తరహా కేసులు అధికంగా ఉన్నాయి.
చట్టబద్ధంగా కొనుగోలు చేసినా తిప్పలే..
మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లాలో ఘట్‌కేసర్ పరిధిలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని 1983లో చట్టబద్ధంగా ఆ శాఖ చేసిన విక్రయాల ద్వారా ప్రజలు కొనుగోలు చేశారు. ప్రజల నుంచి డబ్బులు కట్టించుకున్న దేవాదాయ శాఖ ఇప్పటి వరకు ఆ భూములపై నిరభ్యంతర పత్రం ఇవ్వలేదు. నేటికీ దేవాదాయ శాఖ రికార్డుల్లో నిషేధిత భూముల జాబితాలోనే ఉన్నాయి. దీంతో కలెక్టర్లు సదరు భూములను 22ఏ జాబితాలో పెట్టారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కొనుగోలు చేసిన భూములకు చట్టబద్ధమైన హక్కులను గుర్తించి ఆ భూములు మినహాయించాల్సిన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు కోర్టులు చుట్టూ తిరగాల్సి వచ్చింది. రెవెన్యూ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ, చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూములు మినహాయించి.. మిగిలిన భాగాన్ని 22ఏలో పెట్టాల్సి ఉన్నా.. ఆ పని చేయకపోవడం తమ శాఖ తప్పిదమేనని ఒప్పుకొన్నారు. కోర్ అర్బన్ పరిధిలో వేల సర్వే నంబర్లలో ఈ తరహా సమస్యలు కుప్పలు ఉన్నాయి. ఒక సర్వే నంబరులో 5000 గజాల స్థలంలో 3 వేల గజాలను హెచ్‌ఎండీఏ వేలంలో విక్రయిస్తే మిగిలిన భూమిపై ఏదైనా కోర్టు వివాదం ఉంటే మొత్తం 5 వేల గజాలు 22ఏలో పెట్టేస్తున్నారు. అక్కడ కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్ కోసం వెళితే నిషేఽధిత జాబితాలో ఉందనే కారణంతో రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. రంగారెడ్డి, మేడ్చెల్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో తరహా కేసులు అత్యధికంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు.
తగ్గుతున్న రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం
22ఏ వివాదం రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంపైనా పడిందని సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్నారు. కోర్ అర్బన్ పరిధిలో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ వివాదం వల్ల రిజిస్ట్రేషన్లు తగ్గుతున్నాయని ఓ సబ్ రిజిస్ర్టార్ కార్యాలయ అధికారి చెప్పారు. సమస్యను పరిష్కరించేందుకు రిజిస్ట్రేషన్ శాఖ కూడా 15 పాయింట్లతో జిల్లా రిజిస్ట్రార్లను నివేదిక కోరింది. 22ఏ వివాదాలకు సంబంధించి వచ్చే దరఖాస్తులపై బాఽధితుల వివరాలు, సర్వే నంబరు, కోర్టు కేసులు సమస్య ఏంటో చెబుతూ ఇచ్చిన ప్రొఫార్మా ప్రకారం 15 పాయింట్లలో వివరాలు పంపాలని రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు జిల్లా రిజిస్ట్రార్లను ఆదేశించారు.