నకిలీ ఎన్‌వోసీలతో 22ఏ వివాదాలు!
ABN , Publish Date - Aug 10 , 2026 | 06:10 AM
రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా (22ఏ)పై నెలకొన్న వివాదానికి నకిలీ ఎన్‌వోసీల వ్యవహారం కూడా సమస్యగా మారింది.
తహసీల్దార్ నుంచి కలెక్టర్ దాకా గతంలో ఎన్‌వోసీలు జారీ చేసిన అధికారులు
రికార్డుల్లో కనిపించని ఆ వివరాలు
ఫోర్జరీ సంతకాలతోనూ ఎన్వోసీలు
ప్రస్తుతం నిషేధిత జాబితాలోకి భూములు.. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితులు
గత ప్రభుత్వ హయాంలో ఎక్కువగా ఈ తరహా ఎన్‌వోసీలు
హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా (22ఏ)పై నెలకొన్న వివాదానికి నకిలీ ఎన్‌వోసీల వ్యవహారం కూడా సమస్యగా మారింది. గతంలో భూముల రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలంటూ అధికారులు జారీ చేసిన నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీలు) రికార్డుల్లో ఉండకపోవడంతో.. ఆ భూములను ప్రస్తుతం నిషేధిత జాబితాలో చేర్చారు. అయితే అప్పట్లో ఎన్‌వోసీలు పొందిన బాధితులు మాత్రం వాటినే పట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఏవి నిజమైన ఎన్‌వోసీలో, ఏవి నకిలీవో తెలియక అధికారులు తలపట్టుకుంటున్నారు. ఉదాహరణకు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మేడ్చల్ మండలం దబీర్‌పూర్ గ్రామంలో సర్వే నంబరు 67/ఏ, 67/ఏఏ పరిధిలో 10 ఎకరాల భూమిని 22ఏ జాబితా నుంచి తొలగించాలంటూ 2023 సెప్టెంబరు 13న అప్పటి కలెక్టర్ డి.అమోయ్‌కుమార్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి సిఫారసు చేశారు. కానీ, సిఫారసులకు సంబంధించిన ఫైలు మాత్రం కలెక్టరేట్‌లో లేదు. దీంతో 2025 డిసెంబరు 31న మేడ్చల్ జిల్లా అధికారులు తయారు చేసిన 22ఏ జాబితాలో ఈ సర్వే నంబరులో ఉన్న భూమిని కూడా చేర్చారు. ఒకవేళ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రిజిస్ట్రేషన్ శాఖ అప్పట్లో రిజిస్ట్రేషన్‌కు అనుమతించి ఉంటే ఆ భూములు ఇప్పుడు నిషేధిత జాబితాలో ఉండేవికావు. బాధితులు మాత్రం ‘కలెక్టర్ అనుమతించారు.. నిషేధిత జాబితా నుంచి తొలగించండి’ అంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ తరహా కేసులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా రాజధాని పరిధిలో ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి.
ఎవరి స్థాయిలో వారు సిఫారసులు..
జిల్లా కలెక్టర్, ఆర్డీవో, అదనపు కలెక్టర్, తహసీల్దార్.. ఇలా ఎవరి స్థాయిలో వారు, ఏదో ఒక కారణంతో నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలంటూ గతంలో అనేక సిఫారసులు చేశారు. అయితే అవి అసలువా? నకిలీవా? అనే అనుమానాలను రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కలెక్టర్లు చేసిన సిఫారసులకు సంబంధించిన దస్ర్తాలు చాలావరకు ప్రస్తుతం అందుబాటులో లేవు. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వాస్తవాల ఆధారంగా 22ఏ జాబితాలను అధికారులు తయారు చేసినా.. కలెక్టర్లు, ఇతర అధికారులు ఇచ్చిన అనధికారిక ఉత్తర్వులు సమస్యాత్మకంగా మారాయని రిజిస్ట్రేషన్ శాఖ అధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. కలెక్టర్లు ఇచ్చిన ఉత్తర్వుల నకల్లు కూడా ఇప్పుడు రికార్డుల్లో కనిపించడంలేదు. దీంతో కోర్టు కేసులు, ఇతర వివాదాలతోపాటు ఈ నకిలీ ఎన్‌వోసీలు కూడా 22ఏ వివాదాలకు ఒక కారణంగా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్, దేవాదాయ భూములను రక్షించాల్సిన అధికారుల్లో కొంత మంది లంచాలకు కక్కుర్తి పడి.. గత కొన్నేళ్లుగా నకిలీ ఎన్‌వోసీలు జారీ చేశారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా క్రయ విక్రయాలు జరిగాయి. దీనిపై ప్రభుత్వం లోతైన విచారణ జరిపితే.. గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన ఎన్‌వోసీల్లో అసలు, నకిలీ వ్యవహారం వెలుగుచూసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
ఫోర్జరీ సంతకాలతో ఎన్‌వోసీ..
పెద్ద అంబర్‌పేట పరిధిలో ఓ ఉద్యోగి 2018లో రంగారెడ్డి జిల్లా పరిధిలో 200 గజాల స్థలం కొనుగోలు చేశాడు. విక్రేత రెవెన్యూ అధికారుల నుంచి తీసుకున్న ఎన్‌వోసీ పత్రాన్ని చూపారు. దాని ఆధారంగా రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. తాజాగా ఇంటి నిర్మాణం కోసం బ్యాంకు రుణానికి వెళితే.. ఆ స్థలం 22ఏ జాబితాలో ఉందని తేలింది. దీంతో బాధితుడు గతంలో అధికారులు ఇచ్చిన ఎన్‌వోసీ నకిలీదని, సదరు ఎన్‌వోసీ వివరాలు రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాలేదని గుర్తించాడు.