Share News

ఆరోగ్యానికి భారీగా నిధుల పెంపు

ABN , Publish Date - Mar 21 , 2026 | 04:38 AM

రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా వైద్య రంగానికి ప్రభుత్వం బడ్జెట్‌లో అధిక కేటాయింపులు చేసింది. మొదటిసారి రూ.13,679 కోట్లు కేటాయించింది.

ఆరోగ్యానికి భారీగా నిధుల పెంపు

తొలిసారి రూ.13,679 కోట్లు.. గత ఏడాదికంటే 1,286 కోట్లు పెంపు

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా వైద్య రంగానికి ప్రభుత్వం బడ్జెట్‌లో అధిక కేటాయింపులు చేసింది. మొదటిసారి రూ.13,679 కోట్లు కేటాయించింది. వైద్యవిద్యకు పెద్దపీట వేసింది. మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీల నిర్మాణం, బోధనాస్పత్రుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది. వైద్యవిద్య సంచాలకుల విభాగానికి ఏకంగా రూ.6,681 కోట్లు కేటాయించింది. మొత్తంగా ఆరోగ్య బడ్జెట్‌లో 48.77 శాతం నిధులు డీఎంఈ విభాగానికే కేటాయించింది. ప్రధానంగా వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.381 కోట్లు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు రూ.252 కోట్లు, ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి కొత్త కాంప్లెక్స్‌ నిర్మాణం కోసం రూ.100 కోట్లు, నర్సింగ్‌ కాలేజీ నిర్మాణం కోసం రూ.140 కోట్లు కేటాయించింది. బడ్జెట్‌లో ఆరోగ్యరంగానికి గతేడాది రూ.12,393 కోట్లు కేటాయించగా, ఈమారు మరో రూ.1,286 కోట్లు పెంచింది. అంటే గతేడాదికంటే అదనంగా 9.40 శాతం నిధులు పెరిగాయి. ఇందులో నిర్వహణ వ్యయం కింద రూ. రూ.6,984 కోట్లు కేటాయించగా, ప్రగతి పద్దు(జీతభత్యాలు మినహా అభివృద్ధి పనులకు కేటాయించే మొత్తాన్ని ప్రగతి పద్దు కింద పరిగణిస్తారు) కింద రూ.6,695 కోట్లు చూపింది. గత బడ్జెట్‌తో పోల్చుకుంటే ఈసారి ప్రగతి పద్దు రూ.31 కోట్లు తగ్గగా.. అదే సమయంలో నిర్వహణ వ్యయం రూ.1,317 కోట్లు పెరిగింది. ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య పథకం అమలు చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా బడ్జెట్‌లో ఇందుకు రూ.1,093 కోట్లు కాంట్రిబజీ్యూషన్‌ కింద చెల్లిస్తామని ప్రకటించింది. గతేడాది రాజీవ్‌ ఆరోగ్యశ్రీకి రూ.1,143 కోట్లు కేటాయించగా.. ప్రస్తుత బడ్జెట్‌లోనూ అంతే కేటాయించారు.

సెకండరీ హెల్త్‌ కేర్‌గా టీవీవీపీ

ఇప్పటిదాకా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ సంస్థగా నడుస్తోన్న తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ పరిధిలోని 12,720 బెడ్‌లను ప్రభుత్వం సెకండరీ హెల్త్‌కేర్‌ కిందకు తీసుకువస్తున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించింది.

ప్రగతి పద్దులో ముఖ్యాంశాలు

టీవీవీపీ స్పత్రుల అప్‌గ్రెడేషన్‌ కోసం రూ.164కోట్లు, టీవీవీపీ ఆస్పత్రుల్లో సర్జికల్స్‌, ఎక్విప్‌మెంట్‌, రీజెంట్స్‌ కొనుగోలు కోసం రూ.87 కోట్లు, నిమ్స్‌ కోసం రూ.50కోట్లు, సర్జికల్స్‌, రీయెజెంట్స్‌ కోసం రూ.145కోట్లు, పరీక్షాయేతర యంత్ర పరికరాల కోసం రూ.175 కోట్లు, ఔషధాల కొనుగోలు కోసం రూ.377కోట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రూ.30కోట్లు, డయాగ్నస్టిక్‌ హబ్స్‌ కోసం రూ.30కోట్లు, ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రికి రూ.66కోట్లు కేటాయించారు.

Updated Date - Mar 21 , 2026 | 04:38 AM