వచ్చే ఏడాది అప్పులు 82 వేల కోట్లు
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:48 AM
వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో రూ.82 వేల కోట్ల రుణాలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంగతి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో.....
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 నెలల్లో రుణాలు 69 వేల కోట్లు
మొత్తం రాష్ట్ర ప్రభుత్వ అప్పు 8.64 లక్షల కోట్లు
హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో రూ.82 వేల కోట్ల రుణాలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంగతి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో శుక్రవారం ఈ సంగతి వెల్లడించింది. ప్రస్తుత (2025-2026) ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడి బహిరంగ మార్కెట్ నుంచి రూ.64,539 కోట్ల రుణాలు తీసుకుంటామని ప్రతిపాదించిన రాష్ట్ర సర్కారు... గత జనవరికల్లా తీసుకున్న నికర అప్పు రూ.69,148 కోట్లు. మిగతా రెండు (ఫిబ్రవరి, మార్చి) నెలల అప్పులూ కలిస్తే రూ.73 వేల కోట్ల మార్కును దాటనుండటంతో తాజా సవరించిన బడ్జెట్ ప్రతిపాదనల్లో అప్పు అంచనాలను సర్కారు రూ.67,539 కోట్లకు పెంచింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ అప్పులతో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎ్‌సడీపీ)లో రుణాల వాటా 29 శాతం దాటనుంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల ప్రకారం జీఎ్‌సడీపీలో రుణాలు 25 శాతానికి మించకూడదు. వివిధ ప్రభుత్వ పథకాలు, మూలధన వ్యయం పెరిగిపోవడంతో అప్పు చేయక తప్పడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఏకంగా మూలధన వ్యయమే రూ.47 వేల కోట్లుగా ప్రతిపాదించడంతో రుణాల ఆవశ్యకత ఏర్పడుతుందని చెబుతున్నాయి.