రాబడులు సమకూరేనా
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:47 AM
రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ రాబడులు ఆశించిన మేర సమకూరుతాయా అనే సందిగ్ధత నెలకొంది...
24,166 కోట్ల కేంద్ర గ్రాంట్లు రావడం సాధ్యమా?.. పన్నేతరాల కింద 35,730 కోట్లు కష్టమే!
హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ రాబడులు ఆశించిన మేర సమకూరుతాయా అనే సందిగ్ధత నెలకొంది. తాజా బడ్జెట్‌లో కేంద్ర గ్రాంట్ల కింద రూ.24,166 కోట్లు వస్తాయని ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ వీటిపై ప్రభుత్వానికే కాదు అధికారులకు కూడా పూర్తి నమ్మకం లేదు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర గ్రాంట్ల కింద ప్రభుత్వం రూ.22,782.50 కోట్లు వస్తాయని ప్రతిపాదించింది. కానీ జనవరి నాటికి రూ.4,213 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే వచ్చింది 18.49 శాతమే. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఈ పద్దు కింద రూ.21,636.15 కోట్లను ప్రతిపాదిస్తే సంవత్సరమంతా వచ్చింది రూ.7,913.08 కోట్లే. అంటే 36.57 శాతమే.
పన్నేతర రాబడి కింద భారీగా నిధుల ఆశ
ఇక పన్నేతర రాబడి కింద తాజా బడ్జెట్‌లో రూ.35,730.20 కోట్లు వస్తాయని అంచనా వేసింది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పద్దు కింద రూ.31,618.77 కోట్లను అంచనా వేయగా, సవరించిన అంచనాల్లో రూ.29,318 కోట్లుగా పేర్కొన్నారు. అయితే జనవరి నాటికి రూ.7,864.18 కోట్లు(24.87ు) మాత్రమే వచ్చాయి. సాధారణంగా పన్నేతరాల కింద ప్రభుత్వం భూములను అమ్మడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. కానీ రాష్ట్రంలో భూముల అమ్మకం మందకొడిగా ఉంది. హెచ్‌ఎండీఏ ద్వారా విక్రయిస్తున్న చిన్న చిన్న బిట్ల ద్వారా వేలాది కోట్లు సమకూరే పరిస్థితి లేదు. ఎంత సమకూరినా 2000-3000 కోట్ల మేర సమకూరుతుంటాయి. అలాంటప్పుడు పన్నేతర పద్దు కింద ఆశించిన రాబడి వస్తుందా అన్నది సందిగ్ధమే. అప్పుల కింద రూ.82,870.42 కోట్లు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఇలా తీసుకున్న అప్పును ఎప్పటికైనా తిరిగి చెల్లించాల్సిందే. అంటే నికరంగా ప్రభుత్వానికి వచ్చే రాబడుల కంటే అప్పుల రూపంలో ఉన్న రాబడులే రూ.1,42,766.62 కోట్లుగా ఉండడం గమనార్హం. ఇంత భారీ మొత్తంలో ఉన్న సందేహాత్మక రాబడులతో భారీ బడ్జెట్‌ను ప్రతిపాదించడం చర్చకు దారి తీస్తోంది. ఇదే కాదు రాష్ట్ర పన్నులు, సుంకాల రూపంలో కూడా ప్రభుత్వం భారీగా రాబడులను అంచనా వేసింది. రాష్ట్ర పన్నుల కింద రూ.1,48,185.75 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.33,181,64 కోట్లు మొత్తం రూ.1,81,367.39 కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఇందులో కేంద్ర పన్నుల్లో వాటా సొమ్ము పక్కాగా వస్తుంది. కానీ రాష్ట్ర పన్నుల కింద వస్తాయనుకుంటున్న రూ.1,48,185.75 కోట్లపైనే కొంత సందేహాలున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర పన్నులు, సుంకాల కింద రూ.1,54,124.18 కోట్లు వస్తాయని అంచనా వేసింది. కానీ ఈ జనవరి నాటికి 1,09,796.88 కోట్లు మాత్రమే వచ్చాయి. దీనిని తాజా బడ్జెట్‌లో రూ.1,34,019.58 కోట్లకు సవరించింది. ప్రధానంగా స్టాంపులు-రిజిస్ట్రేషన్ల రాబడి పెద్దగా సమకూరడం లేదు. పెద్ద మొత్తంలో పన్ను రాబడిని ప్రతిపాదించడం ఇబ్బందికరమే అంటున్నారు.