Share News

ఇందిరమ్మ ఇళ్లకు నిధుల కోత

ABN , Publish Date - Mar 21 , 2026 | 04:39 AM

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 6 గ్యారెంటీల పథకాలకు కేటాయించిన మొత్తం బడ్జెట్‌ గతేడాది కంటే తగ్గింది.

ఇందిరమ్మ ఇళ్లకు నిధుల కోత

  • గత ఏడాది పోలిస్తే 7 వేల కోట్లు తక్కువ

  • గతేడాది రైతు భరోసా కేటాయింపుల్లో సగమే ఖర్చు

  • 6 గ్యారంటీల అమలుకు తగ్గిన నిధులు

  • గతేడాది రూ.56,083 కోట్లు.. ఈసారి 50,713 కోట్లు

  • గతేడాది కేటాయింపుల్లోనూ రూ.35,706 కోట్లే ఖర్చు

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 6 గ్యారెంటీల పథకాలకు కేటాయించిన మొత్తం బడ్జెట్‌ గతేడాది కంటే తగ్గింది. గతేడాది బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీల అమలుకు రూ.56,083 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.50,713 కోట్లనే కేటాయించారు. రూ.5,370 కోట్లు తగ్గించారు. మరోవైపు, ఈ గ్యారంటీలకు గతేడాది కేటాయించిన బడ్జెట్‌లో కేవలం రూ.35,706 కోట్లనే ఖర్చు చేశారు. రైతుభరోసాకు రూ.18 వేల కోట్లు కేటాయించినప్పటికీ అందులో కేవలం రూ.8,744(48.52 శాతం) కోట్లే ఖర్చు చేశారు. అంటే కేటాయింపుల్లో సగం నిధులను కూడా రైతుభరోసా కోసం ఖర్చు చేయలేదన్నమాట. ఇక, ఇందిరమ్మ ఇళ్లకు గత బడ్జెట్‌లో రూ.12,571 కోట్లు కేటాయించగా, వాస్తవ ఖర్చు రూ.5,073 కోట్లే అయింది. ఈ బడ్జెట్‌లో కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నిధులను సగం కంటే ఎక్కువగా తగ్గించి కేవలం రూ.5,500కోట్లను కేటాయించారు. గతేడాదితో పోలిస్తే రూ.7,071కోట్లు తగ్గించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వ్యవసాయ భూమి లేని గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ప్రతీ ఏటా రూ.12 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయించగా అందులో కేవలం రూ.55 కోట్లే ఖర్చు చేసింది. ఇదిలా ఉండగా, ఈసారి సన్నధాన్యానికి బోనస్‌ కేటాయింపులు గతేడాది కంటే అదనంగా మరో రూ.1700 కోట్లు పెంచి రూ.3,500కోట్లు కేటాయించారు.

Updated Date - Mar 21 , 2026 | 04:40 AM