Share News

పాత అప్పుల కిస్తీలు, వడ్డీలకే రూ.44 వేల కోట్లు

ABN , Publish Date - Mar 21 , 2026 | 04:37 AM

గత ప్రభుత్వాలు చేసిన అప్పుల తాలూకు భారం ప్రస్తుత ప్రభుత్వంపై పడుతోంది. ప్రతి ఏటా కిస్తీలు, వడ్డీల చెల్లింపులకే నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

పాత అప్పుల కిస్తీలు, వడ్డీలకే రూ.44 వేల కోట్లు

హైదరాబాద్‌, మార్చి 20(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వాలు చేసిన అప్పుల తాలూకు భారం ప్రస్తుత ప్రభుత్వంపై పడుతోంది. ప్రతి ఏటా కిస్తీలు, వడ్డీల చెల్లింపులకే నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభయ్యే 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ కిస్తీలు, వడ్డీల భారం భారీగా ఉండనుందని తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. పాత అప్పుల అసలు చెల్లింపుల కింద మొత్తం రూ.23,024.89 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. నెలా నెలా చెల్లించాల్సి వడ్డీలు రూ.21,304.39 కోట్లుగా ఉన్నాయని వివరించింది. అంటే ఈ రెండు కలిపి మొత్తం తిరిగి చెల్లించాల్సిన అసలు, వడ్డీల సొమ్ము రూ.44,329.28 కోట్లు కావడం గమనార్హం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేవలం వడ్డీ చెల్లింపుల కింద రూ.19,369 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేసింది. కానీ జనవరి నాటికే రూ.24,085.22 కోట్లను వడ్డీల కింద చెల్లించింది. ఏమైనా ఈ రుణాల తిరిగి చెల్లించే భారం ప్రభుత్వానికి ప్రతి ఏటా కష్టంగా పరిణమిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో మూలధన వ్యయాన్ని భారీగా పెంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.47,267.28 కోట్లుగా ప్రతిపాదించింది. 2025-26లో మూలధన వ్యయం కింద రూ.36,504.45 కోట్లను ప్రతిపాదించింది. కానీ జనవరి నాటికి రూ.44,376.34 కోట్ల(121.56ు)ను ఖర్చు చేసింది. ఈ అనుభవం దృష్ట్యా ఈసారి ఏకంగా రూ.47 వేల కోట్లను ప్రతిపాదించింది. మూలధన వ్యయంతో రోడ్లు, భవనాలు వంటి మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. తద్వారా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది.

Updated Date - Mar 21 , 2026 | 04:37 AM