Share News

నేడే కొత్త పద్దు

ABN , Publish Date - Mar 20 , 2026 | 06:00 AM

రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీ ముందు ఉంచనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క....

నేడే కొత్త పద్దు

  • అసెంబ్లీలో 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

  • 3.35 లక్షల కోట్లకు పైగా పద్దు ఉండే చాన్స్‌

  • ప్రస్తుత బడ్జెట్‌ కంటే 10 శాతం పెరుగుదల!

హైదరాబాద్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీ ముందు ఉంచనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలను ప్రతిబింబించేలా ఈసారి బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్లు ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. ఈసారి బడ్జెట్‌ రూ.3.35 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ రూ.3,04,965 కోట్లు కాగా... దీనికి మరో 10 శాతం మేర పెంచి బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిసింది. ఈ బడ్జెట్‌ను ఆమోదించడానికి రాష్ట్ర క్యాబినెట్‌ శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో ఉదయం 9.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్‌ సమావేశమవుతుంది. రేవతి నక్షత్రం, అభిజిత్‌ లగ్నం ముహూర్తాన మధ్యాహ్నం 12 గంటలకు ఉభయసభల్లో బడ్జెట్‌ ప్రసంగం ఒకేసారి ప్రారంభిస్తారు.

కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం

కొత్త బడ్జెట్‌లో ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్ద పీట వేయనున్నట్లు తెలిసింది. జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం పాఠశాల వరకే ఈ పథకం అమలవుతోంది. దీనిని కాలేజీ విద్యార్థులకు కూడా అమలు చేస్తామని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలల్లో ‘ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌’ను కూడా ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. ఒకటో తరగతి నుంచి జూనియర్‌ కాలేజీ వరకు దీనిని అమలు చేయనున్నట్లు సమాచారం. ఈ పథకం కింద దాదాపు 21 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు. గిగ్‌ వర్కర్లకు ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. గిగ్‌ వర్కర్ల సంక్షేమానికి ‘వెల్ఫేర్‌ ఫండ్‌’ను ప్రకటించనుందని సమాచారం. దేవాదాయ శాఖ పరిధిలోని వృద్ధ అర్చకులకు పెన్షన్లను కూడా బడ్జెట్‌లో ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. పారా అథ్లెట్లకు ఇళ్ల స్థలాలు, ఇతర ప్రోత్సాహకాల కోసం నిధుల కేటాయింపు ఉంటుందని భావిస్తున్నారు. కల్యాణ లక్ష్మి పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.1,00,116లతో పాటు తులం బంగారం ఇస్తామని 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. కానీ... బంగారం ధర విపరీతంగా పెరిగిపోవటంతో.. తులం బంగారానికి బదులు కల్యాణ లక్ష్మి కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.1,00,116లకుమరో రూ.50 వేలు కలిపి రూ.1,50,116 ఇవ్వాలని బడ్జెట్‌లో ప్రతిపాదించనున్నట్లు తెలిసింది.


ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌కు నిధులు..

ఇటీవలే ప్రభుత్వం ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని(ఈహెచ్‌ఎ్‌స) సర్కారు ప్రకటించింది. ఉద్యోగుల మూల వేతనాల నుంచి 1.5 శాతం చొప్పున ప్రతి నెలా మినహాయించి, ఈహెచ్‌ఎ్‌స కార్పస్‌ ఫండ్‌లో కలుపుతారు. ఇలా మొత్తం రూ.528 కోట్లు జమ కానున్నాయి. ఇంతే మొత్తం రూ.528 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద బడ్జెట్‌లో కేటాయించే అవకాశాలున్నాయి. రైతు భరోసా, రైతు బీమా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, సన్నాలకు రూ.500 చొప్పున బోనస్‌, సబ్సిడీ బియ్యం వంటి పథకాలకు తగినన్ని నిధులు కేటాయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Updated Date - Mar 20 , 2026 | 06:00 AM