సామాజిక ఆర్థిక సర్వేలోని కీలకాంశాలు
ABN , Publish Date - Mar 21 , 2026 | 05:00 AM
రాష్ట్రంలో భూ వినియోగంలో గత 15 ఏళ్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని సామాజిక, ఆర్థిక సర్వే-2026లో ప్రభుత్వం పేర్కొంది.

రాష్ట్రంలో పెరిగిన సాగు భూమి
హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో భూ వినియోగంలో గత 15 ఏళ్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని సామాజిక, ఆర్థిక సర్వే-2026లో ప్రభుత్వం పేర్కొంది. 2008-09 నుంచి 2023-24 వరకు భూమి వినియోగ నమూనాలను పరిశీలిస్తే.. సాగు భూమి విస్తీర్ణం పెరుగుతున్నట్లు వెల్లడించింది. పాడుపడిన భూముల విస్తీర్ణం తగ్గుతున్నట్లు తెలిపింది. 2008-09లో రాష్ట్రంలో 43.33 లక్షల హెక్టా ర్లు ఉన్న సాగు భూమి, 2020-21 నాటికి గరిష్ఠంగా 59.27 లక్షల హెక్టార్లకు చేరింది. అనంతరం స్వల్ప మార్పులతో 2024-25లో 56.18 లక్షల హెక్టార్ల వద్ద నిలిచింది. పాడుబడిన భూములకు సంబంధించి 2008-09లో 16.79 లక్షల హెక్టార్లు ఉంటే.. 2020-21లో 2.10 లక్షల హెక్టార్లకు పడిపోయింది. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం సుమారు 27 లక్షల హెక్టార్ల వద్ద స్థిరంగా కొనసాగుతున్నట్లు నివేదికలో వెల్లడించారు.
70.59 లక్షల మంది చేతుల్లో 63.12 లక్షల హెక్టార్ల సాగుభూమి
తెలంగాణలో వ్యవసాయ భూముల ఆధీనం, రైతుల సంఖ్యను జిల్లాల వారీగా విశ్లేషిస్తే విభిన్న ధోరణులు కనిపిస్తున్నాయి. 11వ వ్యవసాయ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం వ్యవసాయదారులు 70.59 లక్షల మంది ఉండగా, వారి ఆధీనంలో 63.12 లక్షల హెక్టార్ల భూమి ఉంది. ఎక్కువ మంది రైతులు ఉన్న జిల్లాల జాబితాలో 5.30 లక్షల మందితో నల్లగొండ మొదటి స్థానంలో ఉండగా.. సంగారెడ్డి 3.93, రంగారెడ్డి 3.49, సిద్దిపేట 3.36, ఖమ్మం 3.25 లక్షల మందితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ జిల్లాల్లో వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఎక్కువ సాగు విస్తీర్ణం ఉన్న జిల్లాల జాబితాలో నల్లగొండ 5.14 లక్షల హెక్టార్లతో మొదటి స్థానంలో ఉండగా.. సంగారెడ్డి 3.26, నాగర్‌కర్నూల్ 3.13, రంగారెడ్డి 2.91, వికారాబాద్ 2.71 లక్షల హెక్టార్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తిలో ఈ జిల్లాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తక్కువ మంది సాగుదారులు ఉన్న జిల్లాల జాబితాలో 24 వేల మంది రైతులతో మేడ్చల్ మల్కాజిగిరి, 78 వేల మంది రైతులతో ములుగు జిల్లాలు ఉన్నాయి.

11.12 లక్షల టన్నులకు పెరిగిన మాంసం ఉత్పత్తి
రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి (చికెన్‌తో కలిపి) గణనీయంగా పెరిగినట్లు 2026 సామాజిక ఆర్థిక సర్వేలో ప్రభుత్వం వెల్లడించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 2.30 లక్షల టన్నులుగా ఉన్న మాంసం ఉత్పత్తి 2023-24 నాటికి 11.12 లక్షల టన్నులకు పెరిగినట్లు పేర్కొంది. 2024-25లో స్వల్ప తగ్గుదల కనిపించినా.. మొత్తం మీద మాంసం ఉత్పత్తిలో ఎక్కువ వృద్ధి నమోదైనట్లు నివేదికలో పేర్కొంది.
రికార్డు స్థాయిలో కోడిగుడ్ల ఉత్పత్తి
రాష్ట్రంలో కొడిగుడ్ల ఉత్పత్తి సంఖ్య 2013-14లో 1006.05 కోట్లు ఉండగా.. 2024-25 నాటికి అది 1935.26 కోట్లకు పెరిగింది. ఇది పౌలీ్ట్ర రంగం బలోపేతానికి నిదర్శనమని, గ్రామీణ ఉపాధికి ఈ రంగం కీలకంగా మారిందని ప్రభుత్వం తెలిపింది. పాల ఉత్పత్తిలో సుస్థిరమైన వృద్ధి ఉన్నట్లు సర్వే నివేదికలో చూపింది. 2013-14లో సుమారు 39.24 లక్షల టన్నులు ఉన్న పాల ఉత్పత్తి, 2024-25 నాటికి 59.35 లక్షల టన్నులకు చేరింది. మరోవైపు.. రాష్ట్రంలో మత్స్యరంగం వృద్ధి చెందుతోందని ప్రభుత్వం సర్వే లో వెల్లడించింది. 2008-09 నుంచి 2024-25 వరకు చేపలు, రొయ్యల ఉత్పత్తి నిరంతరం పెరుగుతున్నట్లు తెలిపింది. చేపల ఉత్పత్తి మూడు రెట్లు పెరిగిందని పేర్కొంది. 2008-09లో 1.49 లక్షల టన్నులు ఉన్న ఇన్‌ల్యాండ్ చేపల ఉత్పత్తి, 2024-25 నాటికి 4.62 లక్షల టన్నులకు చేరింది.

మూసీ పునరుజ్జీవానికి 1500కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు మొదటిదశ పనులు ఈ ఏడాది పట్టాలెక్కనున్నాయి. ఇందుకోసం 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.1500 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. గతేడాది కూడా ఇదే మొత్తాన్ని కేటాయించినప్పటికీ.. జీతభత్యాలు, డీపీఆర్ రూపకల్పన వంటి వాటి కోసం రూ.100కోట్ల వరకు విడుదల చేశారు.

హైడ్రాకు రూ.111.48 కోట్లు..!
నగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ, చెరువుల పునరుద్ధరణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హైడ్రాకు బడ్జెట్‌లో రూ.111.48 కోట్లు కేటాయించారు. సంస్థలోని రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ ఖర్చులతో పాటు ఆక్రమణల తొలగింపు వంటి పనుల కోసం ఈ నిధులు వెచ్చించనున్నారు.
5 శాఖలు, 4 విభాగాలకు తగ్గిన కేటాయింపులు
ఇందిరమ్మ ఇళ్ల పథకంలోనూ కోతే..
రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దాదాపు ఐదు ప్రభుత్వ శాఖలు, నాలుగు విభాగాలకు నిధుల కేటాయింపులు బాగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్‌లో ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కోత పడింది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు 2025-2026 బడ్జెట్‌లో రూ.12,751 కోట్లు కేటాయించగా, ఈసారి కేవలం రూ.7430 కోట్లకు సరిపెట్టారు. గతంకంటే ఈసారి దాదాపు రూ.5,321కోట్లు తగ్గాయి. అలాగే వ్యవసాయ శాఖ, ఇరిగేషన్, పశు సంవర్ధక, పరిశ్రమల శాఖలతో పాటు చేనేత పథకాలు, డైట్, స్కాలర్‌షిప్స్ విభాగాలకు బడ్జెట్‌లో నిధులు తగ్గడం గమనార్హం.