Share News

మండలి విప్‌లుగా అద్దంకి, బల్మూరి

ABN , Publish Date - Mar 20 , 2026 | 06:03 AM

శాసనమండలి విప్‌లుగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్‌, వెంకట్‌ నర్సింగరావు బల్మూరిలను.. శాసనసభ విప్‌లుగా ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు...

మండలి విప్‌లుగా అద్దంకి, బల్మూరి

  • శాసనసభ విప్‌లుగా విజయరమణారావు, యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, వేముల వీరేశం

  • రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు

హైదరాబాద్‌, మార్చి 19(ఆంధ్రజ్యోతి): శాసనమండలి విప్‌లుగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్‌, వెంకట్‌ నర్సింగరావు బల్మూరిలను.. శాసనసభ విప్‌లుగా ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశంలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. మండలికి ప్రస్తుతం చీఫ్‌ విప్‌గా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఆయనకు అనుబంధంగా అద్దంకి, బల్మూరిలను విప్‌లుగా సర్కారు నియమించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన తొలినాళ్లలోనే శాసనసభ విప్‌లుగా పార్టీ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్‌, బీర్ల అయిలయ్య, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, రామచంద్రనాయక్‌లను నియమితులయ్యారు. అయితే ఈ నలుగురిలో అడ్లూరిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ప్రస్తుతం ముగ్గురే విప్‌లుగా కొనసాగుతున్నారు. తాజాగా ముగ్గురి నియామకంతో శాసనసభ విప్‌ల సంఖ్య ఆరుకు చేరింది.

వెలమలకు 2 పోస్టులు..

కొత్త నియామకాలతో శాసనసభ, మండలి కలిపి విప్‌ల సంఖ్య 8కి చేరుకుంది. ఈ ఎనిమిది పదవుల్లో రెడ్డి, లంబాడా, మాదిగ, మాల సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. బీసీ వర్గం నుంచి ఇద్దరు.. ఆది శ్రీనివాస్‌ (మున్నూరు కాపు), బీర్ల అయిలయ్య (కురుమ) ఉన్నారు. వెలమ సామాజిక వర్గం నుంచి బల్మూరి, విజయరమణారావు ఉన్నారు. ఈ ఇద్దరూ తాజాగా నియమితులైనవారే.. రెడ్డి సామాజిక వర్గం నుంచి విప్‌గా యెన్నం శ్రీనివా్‌సరెడ్డి ఒక్కరే ఉన్నా.. మండలి చీఫ్‌ విప్‌ పదవిలో ఇదే సామాజిక వర్గానికి చెందిన పట్నం మహేందర్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఇక మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరిని మంత్రి పదవిలోకి తీసుకున్న నేపథ్యంలో ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వేముల వీరేశంను విప్‌గా ఎంపిక చేశారు. ఎస్టీ లంబాడా సామాజిక వర్గం నుంచి శాసనసభ విప్‌గా రామచంద్రనాయక్‌ కొనసాగుతుండగా.. మాల సామాజిక వర్గం నుంచి మండలి విప్‌గా అద్దంకిని ఎంపిక చేశారు.


పెండింగ్‌లోనే ఆ రెండు పోస్టులు..

పార్టీ ఎమ్మెల్యేలు మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణపై ఆశలు పెట్టుకుని ఉండటంతో చాలాకాలంగా శాసనసభ చీఫ్‌ విప్‌, డిప్యూటీ స్పీకర్‌ పదవులు పెండింగ్‌లోనే కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిలకు చీఫ్‌ విప్‌ పోస్టును పార్టీ నాయకత్వం గతంలోనే ప్రతిపాదించింది. అయితే మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న వారిద్దరూ ఆ పదవిని తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. అలాగే వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌లను మంత్రివర్గంలోకి తీసుకున్నప్పుడే విప్‌గా ఉన్న రామచంద్రనాయక్‌ను డిప్యూటీ స్పీకర్‌ అభ్యర్థిగా ప్రతిపాదనను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆమోదించింది. అయితే మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ జరిగితే లంబాడా సామాజిక వర్గం కోటాలో తనకు ఛాన్స్‌ దక్కుతుందన్న భావనలో ఆయన ఉన్నారు. ప్యానెల్‌ స్పీకర్‌గా సభను ఎమ్మెల్యే బాలూనాయక్‌ బాగా హ్యాండిల్‌ చేస్తున్నారంటూ ఇటీవల సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి కితాబును ఇవ్వడంతో డిప్యూటీ స్పీకర్‌గా ఆయన్ను తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో లంబాడా సామాజిక వర్గం కోటాలో సీనియర్‌ ఎమ్మెల్యేగా బాలూనాయక్‌ సైతం పోటీ పడుతున్నారు. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణతో శాసనసభ చీఫ్‌ విప్‌, డిప్యూటీ స్పీకర్‌ పదవులు ముడిపడి ఉండటంతో ఇవి మరికొంత కాలం పెండింగ్‌లోనే కొనసాగే అవకాశమున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ నెలాఖరు కల్లా వివిధ కులాల అభివృద్ధి కార్పొరేషన్లు, ఇతర కీలకమైన కార్పొరేషన్లకూ చైర్మన్ల నియామకమూ జరగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

14 డీసీసీలను ప్రకటించిన టీపీసీసీ చీఫ్‌

రాష్ట్రవ్యాప్తంగా 36 జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ)లకు 14 కమిటీలను టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ గురువారం ప్రకటించారు. రాష్ట్రంలోని డీసీసీలకు ఇప్పటికే అధిష్ఠానం అధ్యక్షులను నియమించిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా డీసీసీ అధ్యక్షులు, స్థానిక నేతలు.. మండల, జిల్లా కమిటీల కార్యవర్గాల కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. ఈమేరకు పూర్తయిన 14 డీసీసీలను ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మహేశ్‌ గౌడ్‌ ప్రకటించారు. ఆయా డీసీసీల కార్యవర్గ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

ప్రకటించిన 14 డీసీసీలు ఇవే: ఖైరతాబాద్‌, నిజామాబాద్‌, నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లి, మెదక్‌, నిర్మల్‌, ఖమ్మం, కామారెడ్డి, మంచిర్యాల, ఆదిలాబాద్‌, వనపర్తి, ఆసిఫాబాద్‌, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్‌ నగర కమిటీ..

Updated Date - Mar 20 , 2026 | 06:03 AM