ఉత్తుత్తీర్ణత..!
ABN , Publish Date - Jul 04 , 2026 | 05:48 AM
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఈసారి తెలంగాణ రాష్ట్రం ‘రికార్డు’ నెలకొల్పింది. దేశంలో కేరళతో సమానంగా ప్రథమ స్థానాన్ని సాధించింది.
పదో తరగతి ఫలితాల్లో దేశంలో ‘ప్రథమ స్థానం’పై సందేహాలు
ఈసారి టెన్త్ ఫలితాల్లో రాష్ట్రంలో 99.07 శాతం ఉత్తీర్ణత
5,16,815 మంది విద్యార్థుల్లో ఫెయిలైంది 4,844 మందే
ప్రభుత్వ బడుల్లోనూ ‘100 శాతం’ ఉత్తీర్ణతలే ఎక్కువ
ఈసారి కేరళతో సమానంగా తెలంగాణ అగ్ర స్థానం
దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న విద్యావేత్తలు
విద్యార్థుల్లో అత్యధికులకు ఇంటర్నల్స్‌లో 20కి 20
గతానికి భిన్నంగా ఈసారి కాంప్రహెన్షన్ ప్రశ్నలు ఎక్కువ
షార్ట్, వెరీ షార్ట్ ఆన్సర్ ప్రశ్నలకు ఇన్విజిలేటర్ల సహకారం
8వ తరగతి విద్యార్థులకు చిన్నపాటి కూడికలు, తీసివేతలు
రావడం లేదంటున్న సర్వేలు.. అయినా అద్భుత ఫలితాలు!
ఈసారి పదో తరగతి పరీక్షలు రాయని వారిదే పాపం! ఎందుకంటే.. పరీక్షలు రాసిన వారిలో దాదాపు అందరినీ పాస్ చేసేశారు మరి!
గతంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చినప్పుడు ‘100 శాతం’ ఉత్తీర్ణత నమోదైన స్కూళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో పదో పరకో ఉండేవి! కానీ, ఈసారి దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలూ ‘నూరు శాతం ఉత్తీర్ణత’ సాధించాయి! ఇక, గతంలో ‘జీరో’ ఫలితాలు వచ్చిన ప్రభుత్వ పాఠశాలలు పెద్దఎత్తున ఉండేవి. విచిత్రంగా, ఈసారి ‘జీరో’
హైదరాబాద్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఈసారి తెలంగాణ రాష్ట్రం ‘రికార్డు’ నెలకొల్పింది. దేశంలో కేరళతో సమానంగా ప్రథమ స్థానాన్ని సాధించింది. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఇప్పటి వరకూ కేరళ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈసారి పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో కేరళతో సమానంగా 99.07 శాతం ఫలితాలను సాధించి తెలంగాణ కొత్త చరిత్ర సృష్టించింది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనూ ఇప్పటి వరకూ ఎన్నడూ ఈస్థాయిలో ఉత్తీర్ణత సాధించలేదు! ఈసారి మార్చి నెలలో నిర్వహించిన పదో తరగతి వార్షిక పరీక్షలకు మొత్తం 5,28,239 మంది హాజరయ్యారు.
వారిలో 4,91,774 (95.15శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక్కడ ఫెయిలైన విద్యార్థుల సంఖ్య కేవలం 25,041 మాత్రమే. అనంతరం నిర్వహించిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను 27,857 మంది రాశారు. వారిలో 23,013 మంది (82.61శాతం) ఉత్తీర్ణత సాధించారు.మొత్తంగా, వార్షిక, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో కలిపి ఈ ఏడాది ఫెయిలైన విద్యార్థుల సంఖ్య కేవలం 4,844 (0.91 శాతం) మాత్రమే. వారిలోనూ అత్యధికులు అసలు పరీక్షకే హాజరుకాని విద్యార్థులు కావడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే ఈసారి పది పరీక్షలు రాసిన ప్రతి విద్యార్థి పాసయ్యాడు. ఇది ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ 90 శాతానికి అటూ ఇటుగా ఉండే ఉత్తీర్ణత ఈసారి దాదాపు వంద శాతానికి చేరడంతో ఇది ఉత్తీర్ణతా లేక ఉత్తుత్తీర్ణతా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఈసారి 99.07 శాతం ఉత్తీర్ణత ఎలా సాధ్యమైందనే దానిపై ఉపాధ్యాయ వర్గాల్లోనే చర్చోపచర్చలు సాగుతున్నాయి. నిజానికి, ఉమ్మడి రాష్ట్రంలో పదిలో సరాసరి ఉత్తీర్ణత 70 శాతం మించేది కాదు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఉత్తీర్ణత శాతంలో పెరుగుదల నమోదవుతూ వచ్చింది. కొవిడ్ సమయంలో తప్ప.. గత పదేళ్లలో ఎన్నడూ 93 శాతం దాటలేదు. గత ఏడాది (2025)లో 92.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. కానీ, ఈ ఏడాది అన్ని రికార్డులను తిరగరాసేసింది. ఈ గణాంకాలపై విద్యావేత్తలు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణాలను అన్వేషిస్తున్నారు. పరీక్ష నిర్వహణ తీరుతోపాటు మూల్యాంకనం ఇందుకు కారణంగా భావిస్తున్నారు. నిజానికి, పదో తరగతి వార్షిక పరీక్షల్లో ప్రతి సబ్జెక్టుకు వంద మార్కులు ఉంటాయి. ఇందులో ఇంటర్నల్ పరీక్షలకు 20 మార్కులుంటాయి. వీటిని పాఠశాల ఉపాధ్యాయుడే కేటాయిస్తారు.
సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్‌ఏ), ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్‌ఏ) పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా వీటిని కేటాయిస్తారు. అయితే, విద్యార్థి విద్యా సామర్థ్యంతో సంబంధం లేకుండా పాఠశాలలు 20కి 20 మార్కులు వేసేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. అసలు ఎఫ్‌ఏ, ఎస్‌ఏ పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు కూడా గరిష్ఠ మార్కులు వేసేస్తున్నారని అంటున్నారు. ఇక, వార్షిక పరీక్షల్లో మిగిలిన 80 మార్కుల్లో ఉత్తీర్ణతకు కావాల్సింది కేవలం 15 మాత్రమే. ఇందులోనూ షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ ప్రశ్నలకు అనేక చోట్ల ఉపాధ్యాయులే సమాధానాలు చెబుతున్నారన్న ఆరోపణలున్నాయి. గతానికి భిన్నంగా, ఇటీవల పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాసే ‘కాంప్రహెన్షన్’ విభాగాలు ఎక్కువగా ఇస్తున్నారు. తద్వారా, విద్యార్థులు సులభంగా ఎక్కువగా మార్కులు సాధించడానికి అవకాశం ఉంటోంది. ఇక, విద్యార్థి సరిగా రాయకపోయినా.. మూల్యాంకనంలో ఎలాగోలా 35 మార్కులు దాటిస్తున్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి. ఈసారి 30-34 మార్కులు వచ్చిన విద్యార్థుల సమాధాన పత్రాలను మరోమారు మూల్యాంకనం చేసి వీరిలో అత్యధికులకు 35 మార్కులు కేటాయించారని ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈసారి రికార్డు స్థాయి ఉత్తీర్ణత సాధించడం వెనక ఇవన్నీ కారణాలుగా చెబుతున్నారు. కేవలం ఫలితాల గణాంకాలను చూపించి విద్యలో నాణ్యత పెరిగిందనడంలో వాస్తవం లేదని, ఈ ఫలితాలు విద్యార్థి ప్రతిభకు ఎంతమాత్రం కొలమానం కావడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతిభకు ప్రామాణికమేనా..?
పదో తరగతిలో రికార్డు స్థాయి ఫలితాలు సాధించామని ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈ ఘనత సాధ్యమైందని అంటోంది. కానీ, పాఠశాల విద్యలో నాణ్యత మేడిపండు చందమేనని, పదో తరగతి పూర్తి చేసినా కూడికలు, తీసివేతలు కూడా కొందరికి రావడం లేదని అనేక సర్వే సంస్థలు మొత్తుకుంటున్నాయి. వీటిలో కీలకమైనది ప్రథమ్ ఫౌండేషన్ ప్రతి ఏటా నిర్వహించే అసర్ సర్వే. ఈ సంస్థ అన్ని రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరీక్షించి నివేదికను విడుదల చేస్తుంది. తెలంగాణకు సంబంధించి తాజాగా విడుదల చేసిన సర్వేలోనూ పాఠశాల విద్యలో వెనకబాటుతనాన్ని స్పష్టంగా ఎత్తి చూపింది. సర్వే నివేదిక ప్రకారం.. 6-8 తరగతి చదువుతున్న విద్యార్థుల్లో 54 శాతం మంది రెండో తరగతి పాఠ్యాంశాలను చదవలేకపోతున్నారు. 65 శాతం మంది సాధారణ కూడికలు, తీసివేతలు, భాగహారాలు చేయలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 8వ తరగతిలో ప్రతి ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు చదువులో అత్యంత వెనకబాటులో ఉన్నారు. 8వ తరగతిలో వీరి విద్యా సామర్థ్యం ఇలా ఉంటే.. పదో తరగతి వార్షిక పరీక్షల్లో మొత్తం ఆరు సబ్జెక్టుల్లోనూ ఉత్తీర్ణత మార్కులు ఎలా సాధిస్తున్నారని విద్యావేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.