ఖబడ్దార్.. తేజస్వీ సూర్య!
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:48 AM
తెలంగాణ తల్లి క్షోభించేలా, అమరులను అవమానించేలా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
తెలంగాణ తల్లి క్షోభించేలా తప్పుడు వ్యాఖ్యలు.. అజ్ఞానులు లోక్‌సభలోకి వచ్చారు: పొన్నం
తేజస్వి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ
తేజస్వి క్షమాపణ చెప్పాలి: కోమటిరెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ తల్లి క్షోభించేలా, అమరులను అవమానించేలా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ‘తెలంగాణ ఏర్పాటును అవహేళన చేస్తూ మాట్లాడితే ఖబడ్డార్.. తేజస్వి’ అని హెచ్చరించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తేజస్వి మాట్లాడుతుంటే.. బీజేపీ రాష్ట్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు చూస్తూ కూర్చోవడం దౌర్భాగ్యమని మండిపడ్డారు. అజ్ఞానులు, ధనబలం, మందబలంతో లోక్‌సభకు వచ్చిన బీజేపీ ఎంపీలకు వారి పార్టీ అయినా బుద్ధి నేర్పించాలని వ్యాఖ్యానించారు. తేజస్వి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు పొన్నం లేఖ రాశారు. తెలంగాణ ఏర్పాటును భారత్-పాక్ విభజనతో పోల్చుతూ వ్యాఖ్యలు చేసిన తేజస్విపై చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్‌రెడ్డిని మంత్రి పొన్నం కోరారు. ఇక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి పరాకాష్ఠ అని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. గతంలో ప్రధాని మోదీ తల్లిని చంపి బిడ్డను వేరు చేశారంటూ మాట్లాడారని.. ఆ విద్వేష భావజాలమే ఇప్పుడు తేజస్వి మాటల్లో ప్రతిబింబిస్తోందని విమర్శించారు. తేజస్వి వ్యాఖ్యలు హేయమని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణ, సీఎం రేవంత్‌పై తేజస్వి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని టీపీసీసీ నేత చనగాని దయాకర్ డిమాండ్ చేశారు.
నాడు మోదీ.. నేడు తేజస్వి సూర్య: హరీశ్
ప్రధాని మోదీ గతంలో అనేక సార్లు తెలంగాణపై విషం చిమ్మారని, ఇప్పుడు తేజస్వి కూడా పాకిస్థాన్‌తో పోల్చుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచారని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. తేజస్వి వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఖండించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్ ఎంపీలు ఉంటే తేజస్వి సంగతేమిటో తేల్చేవారని వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ నరనరానా తెలంగాణ వ్యతిరేకత ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రధాని మోదీ నుంచి తేజస్వి వరకు బీజేపీ నాయకులు పదేపదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించడం అలవాటుగా మార్చుకున్నారని విమర్శించారు. తేజస్వి వ్యాఖ్యలు అజ్ఞానానికి, దురహంకారానికి నిదర్శనమని సీపీఎం రాష్ట్రకార్యదర్శి జాన్‌వెస్లీ మండిపడ్డారు. తేజస్వి వ్యాఖ్యలు యావత్ తెలంగాణ సమాజానికి అవమానమని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు పౌరుషముంటే తేజస్వి వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్ చేశారు.
కోతికి కొబ్బరికాయ దొరికినట్టు బీఆర్‌ఎస్ వైఖరి: రాంచందర్‌రావు
కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా తేజస్వి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. బీజేపీ మద్దతు ఇవ్వకుంటే తెలంగాణ ఏర్పాటు సాధ్యమయ్యేదా?అని నిలదీశారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ జాప్యంతో యువత ప్రాణత్యాగాలు చేశారని, పోలీసు తూటాలకు బలయ్యారని గుర్తు చేశారు. వాజ్‌పేయి ప్రభుత్వం ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను సాఫీగా ఏర్పాటు చేసిందని చెప్పారు. ఉమ్మడి ఏపీ విభజనను తమ ఎంపీ ప్రస్తావిస్తే బీఆర్‌ఎస్ విమర్శలు చేయడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.