నన్నే పెళ్లాడాలి!
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:25 AM
నన్నే పెళ్లి చేసుకోవాలి.. లేదంటే నిన్ను చేసుకోబోయేవాడిని.. నీ తల్లిదండ్రులను చంపేస్తా.. అంటూ ఓ యువకుడు బెదిరించడంతో భయపడిన యువతి చెరువులో....
ప్రేమికుడి బెదిరింపు.. చెరువులో దూకి యువతి ఆత్మహత్య
అల్లాదుర్గం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): నన్నే పెళ్లి చేసుకోవాలి.. లేదంటే నిన్ను చేసుకోబోయేవాడిని.. నీ తల్లిదండ్రులను చంపేస్తా.. అంటూ ఓ యువకుడు బెదిరించడంతో భయపడిన యువతి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం అప్పాజీపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్థులు, ఎస్సై శంకర్ కథనం ప్రకారం.. అప్పాజీపల్లికి చెందిన ఎర్రోళ్ల రూప(21) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో గణేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేసేందుకు ఓ యువకుడితో పదిరోజుల క్రితం నిశ్చితార్థం చేశారు. ఇది తెలిసిన గణేష్.. రూపకు ఫోన్ చేస్తూ తనను కాదని మరొకరిని వివాహం చేసుకుంటే నీ తల్లిదండ్రులతోపాటు నీకు కాబోయే భర్తను హతమారుస్తానంటూ బెదిరించాడని ఆమె కుటుంబీకులు తెలిపారు. ఆందోళన చెందిన రూప సోమవారం చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను చెరువులోంచి తీసి.. జోగిపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.